Artificial Intelligence: అమెరికా నుంచి మొదలుపెడితే ఇండియా వరకు కోతలే కోతలు.. పింక్ స్లిప్ లే పింక్ స్లిప్పులు.. ఇది ఎక్కడిదాకా వెళ్తుందనేది ఎవరో చెప్పడం లేదు. ఎంత దాకా వెళుతుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ప్రపంచం మాత్రం ఒక దారుణమైన స్థితిలోకి వెళ్తోంది. ముఖ్యంగా ఉద్యోగం అనేది దొరకని హీనమైన పరిస్థితి రాబోతోంది. ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు పోయి చాలామంది నరకం అనుభవిస్తున్నారు. ఇంతటి దారుణమైన స్థితిలో మరొక ఘోరమైన విషయం తెలిసింది. అది పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఐటి కంపెనీలు తిరుగులేని జాబ్ మార్కెట్ సృష్టించాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ.. బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్ కతా, విశాఖపట్నం.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదే. ఐటీ ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా ఉన్నతశ్రేణి వేతనాలు ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు. వీటిలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల కొత్త కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఉద్యోగులు ఆ మార్పు ను కచ్చితంగా స్వీకరించాలి. దానికి తగ్గట్టుగా మారాలి. లేకపోతే ఐటీ లో ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులకు కారణమవుతోంది.
కృత్రిమ మేధ ద్వారా….
సాంకేతిక రంగంలోకి కృత్రిమ మేధ ప్రవేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కృత్రిమ మేధ వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కోల్పోతూనే ఉన్నారు. దాదాపు 2030 నాటికల్లా 99 శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే ప్రొఫెసర్ రోమన్ యంపోల్స్కీ పేర్కొన్నారు అయితే ఈ నష్టాన్ని పూడ్చడానికి ప్లాన్ బి కూడా లేదట. కృత్రిమ మేధ వల్ల కంపెనీలకు భారీగానే ఆదాయం వస్తుందని.. అందువల్లే దీనికి విపరీతమైన ప్రాధాన్యం పెరుగుతోంది. కృత్రిమ మేధ వల్ల కోడర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. భవిష్యత్తు కాలంలో ఈ విభాగాలలో ఉద్యోగాలు అనేవి ఉండవని.. ఇవి మరుగున పడిపోతాయని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా డెవలపర్స్ ఉద్యోగాలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయని సమాచారం. మొత్తంగా చూస్తే కృత్రిమ మేధ అనేది ఐటీ రంగంలో పెను ప్రకంపనలకు నాంది పలుకుతోంది. దీనివల్ల పాత ఉద్యోగాలు పోయి.. వినూత్నమైన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.