TRP Ratings Ban: టీవీ చానెల్స్ కి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. టీవీ చానెల్స్ ఆదాయానికి కొలమానం గా నిలిచే TRP రేటింగ్స్ పై నిషేధం విధిస్తు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే టీవీ చానెల్స్ కి కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి. రేటింగ్స్ ని బట్టే టీవీ చానెల్స్ యాజమాన్యాలు భారీ రేంజ్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇకపై అలాంటి అవకాశాలు తగ్గిపోనున్నాయి. దేశం లోని అన్ని రకాల టీవీ చానెల్స్ ర్యాంకింగ్స్ , రేటింగ్స్ ని నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో ఈ టీఆర్ఫీ రేటింగ్స్ వ్యవహారం లో తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ని నిలిపివేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా జనరల్ ఎంటర్టైన్మెంట్ , సినిమా , స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ చానెల్స్ కి కూడా రేటింగ్స్ ని నిలిపివేసింది. ఈ కఠిన నిర్ణయం వెనుక కారణాలు ఉన్నాయి. కొన్ని ఛానళ్ళు అనుచిత , అక్రమ పద్ధతులు అనుసరించడమే అందుకు ప్రధాన కారణం. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కిస్తున్న ప్రస్తుత బార్-ఓ-మీటర్ల వ్యవస్థను కొన్ని పెద్ద నెట్ వర్కులు మేనేజ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తప్పుడు పద్ధతుల్లో రేటింగ్స్ ని పెంచుకొని ప్రకటనదారులు మోసం చేస్తున్నాయనే ఆరోపణలు ఈమధ్య కాలం లో ఎక్కువగా వెల్లువెత్తాయి. కేవలం రేటింగ్స్ రేసులో ముందంజలో ఉండడం కోసం ఛానళ్ళు కంటెంట్ లోని నాణ్యత ని దిగజారుస్తున్నారని , అది సమాజం పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ టీఆర్ఫీ రేటింగ్స్ విధానానికి ప్రత్యామ్నాయంగా పారదర్శకతతో కూడిన వ్యవస్థని తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతిక నిపుణులు , ఐటీ రంగ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం డిజిటల్ సెట్-టాప్ బాక్సుల ద్వారా వచ్చే డేటాను రియల్-టైమ్‌లో పారదర్శకంగా చూసే విధానాన్ని ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పరిశీలిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలివిజన్ ఇండస్ట్రీ ని , అడ్వర్టైజింగ్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ప్రతీ ఏటా వేల కోట్ల రూపాయిల ఆదాయం యాడ్స్ రూపం లో వచ్చేవి , ఇవన్నీ రేటింగ్స్ ఆధారంగానే జరిగేవి. ఇప్పుడు కొత్త వ్యవస్థ అమ్మల్లోకి వచ్చే వరకు రేటింగ్స్ నిలిపివేయడం వల్ల వంద కోట్ల నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.

