Atmakur By Poll: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 64.17 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ విషయంలో అధికార వైసీపీకి చుక్కెదురయ్యింది. సంక్షేమ పథకాల ప్రభావం ఈ ఎన్నికల్లో కనీసం కనిపించలేదు. ఓటు వేయాలన్న ఉత్సాహం కూడా ప్రజల నుంచి వ్యక్తం కాలేదు. ఓటింగ్ సరళే దీనిని తేటతెల్లం చేసింది. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 82 శాతం పోలింగ్ నమోదైంది. అదే స్థాయిలో ఉప ఎన్నికలో కూడా ఓటింగ్ నమోదవుతుందని భావించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో విపరీతమైన సానుభూతి వ్యక్తమై భారీగా ఓటింగ్ నమోదవుతుందని అధికార పార్టీ నేతలు భావించారు. కానీ పోలింగ్ 64 శాతం వద్దకు వచ్చి నిలిచిపోయింది. గత ఎన్నికల కంటే దాదాపు 18 శాతం ఓటింగ్ తగ్గింది. దీంతో వైసీపీలో గుబులు రేపుతోంది. విపరీతమైన సానుభూతి, మేకపాటి కుటుంబానికి పెట్టని కోటగా ఆత్మకూరు ఉండడంతో దాదాపు లక్షకుపైగా మెజార్టీ సాధిస్తామని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో ఓటు వేసేందుకు ప్రజలు మొగ్గుచూపలేదు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దాదాపు 40 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దీంతో టీడీపీ సానుభూతిపరులు పోలింగ్ కేంద్రాలకు ముఖం చాటేసినట్టు తేటతెల్లమవుతోంది.
వైసీపీలో టెన్సన్..
అయితే పోలింగ్ సరళిని చూసుకున్న వైసీపీ నాయకులకు టెన్షన్ పట్టుకుంది. గురువారం ఉదయం నుంచే వారు పోలింగ్ కేంద్రాల వద్ద హల్ చల్ చేశారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పలుచనగా కనిపించారు. సాయంత్రానికి మాత్రం కాస్త పర్వాలేదనిపించారు. కానీ మెజార్టీపై పోటా పోటీ ప్రకటనలు చేసిన వైసీపీ నాయకులు ఓటింగ్ సరళి చూసి ఆలోచనలో పడ్డారు. ఓటింగ్ పెంచే ప్రయత్నంలో పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..
తమకు గెలుపు ముఖ్యం కాదని.. మెజార్టీ తగ్గించడమే తమ లక్ష్యమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ప్రతీ గ్రామాన్ని ఒక యూనిట్ గాచేసుకొని వైసీపీ ప్రజాప్రతినిధుల ఇన్ చార్జిలుగా నియమించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు మండలాల బాధ్యతలు అప్పగించారు. మంత్రులు రోజా, జోగి రమేష్,అంజాద్ బాషా, అంబటి రాంబాబు, కాకాని గోవర్థన్ రెడ్డి వంటి వారు ప్రచారపర్వంలోకి దిగారు. అంతటితో ఆగకుండా లక్ష మెజార్టీపై పదే పదే ప్రకటనలు చేశారు. అయితే ఓటింగ్ శాతం తక్కువ కావడంతో పునరాలోచనలో పడ్డారు. ఒక వేళ మెజార్టీ కాని తగ్గితే మాత్రం రాజకీయంగా ప్రతికూలంశంగా మారనుంది. ప్రధాన విపక్షాలేవీ పోటీచేయకున్నా.. ప్రచారం చేయకున్నా అధికార పార్టీ ప్రభావం చూపలేకపోయిందన్న టాక్ విస్తరిస్తోంది. అందుకే వైసీపీ నేతలు లోలోన రగిలిపోతున్నారు.
బీజేపీలో ఆ నాయకులేరీ?
బీజేపీలో నాయకులు ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న అపవాదునైతే మూటగట్టుకున్నారు. వాస్తవంగా ఆ పార్టీలో నాయకులకు కొదువ లేదు. పేరు చివరన రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులు చెప్పనక్కర్లేదు. కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వారి జాడ లేదు. ఏపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ లాంటి పెద్ద నాయకుల లీస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ పెద్ద నాయకుల ప్రకటనలు పెద్దవి. చేసే పనులు చిన్నవన్న అపవాదు ఉంది. పెద్ద నాయకులంతా పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు మీడియా మీటింగ్లకే పరిమితం అవుతుండడంపై కూడా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. వీరెవరూ ఆత్మకూరు ఉప ఎన్నిక ముఖం చూడలేదు. ఒకరిద్దరు వచ్చిన మమ అనిపించేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా భరత్ బరిలో నిలిచారు. కానీ ఆయన నాన్ లోకల్. ఆయనకు మద్దతుగా నిలవడంలో బీజేపీ నేతలు వెనుకబడ్డారు. కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్నికల వ్యూహాలు రూపొందించలేని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. టీడీపీ బీజేపీతో స్నేహానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అభ్యర్థి లేకపోవడంతో స్థానికంగా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకునే అవకాశముంది. మరోవైపు మిగతా రాజకీయ పక్షాలు కూడా వైసీపీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. వారి మద్దతు పొందడం ద్వారా వైసీపీని దిగ్బంధించే మంచి అవకాశం వచ్చినా బీజేపీ నేతలు జాడ విరుచుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కరే ఒంటరిగా పోరాడారు. మీడియా సమావేశాలు, ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ ఉనికి చాటుకునేందుకు, చాటిచెప్పేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మెజార్టీ పెరిగితే మాత్రం ఏపీలో బీజేపీకి ఉన్న కాస్త ఆదరణ తగ్గుముఖం పట్టే అవకాశముంది. అదే తగ్గితే మాత్రం బీజేపీ వేదికగా రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది.
Also Read:Balakrishna’s Younger Brother: బాలకృష్ణ తమ్ముడు చిరంజీవి తో కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: 64 7 percentage polling registered in atmakur by poll
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com