YCP Plenary: వైసీపీ పండుగ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 40 ఎకరాల ప్రాంగణం ప్లీనరీకి వేదిక కానుంది. వేదికను వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేశాయి. టీడీపీ మహానాడుకు దీటుగా జన సమీకరణ చేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో సన్నాహక శిబిరంగా మినీ ప్లీనరీలను నిర్వహించారు. జిల్లాస్థాయి ప్లీనరీలు నిర్వహించి నేతలకు, కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు గుంటూరు జిల్లాకు చేరుకుంటున్నాయి. మరోవైపు సీఎం జగన్ కడపలోని ఇడుపాలపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. కుటుంబసభ్యులతో పాటు నివాళులర్పించిన తరువాత సీఎం జగన్ నేరుగా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటారు. మరోవైపు జగన్ సోదరి, తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ, తల్లి విజయమ్మ కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ప్లీనరీకి హాజరుకానున్నారు. అదే సమయంలో సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైఎస్సార్ జయంతి వేడుకల నిర్వహణకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
కార్యక్రమాలు ఇలా…
ఉదయం 8 గంటల నుంచి ప్లీనరీలో పేర్ల రిజిస్ట్రేషన్లతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు ఇడుపలపాయ నుంచి చేరుకోనున్న జగన్ పార్టీ జెండా ఆవిష్కరించి అధికారికంగా ప్లీనరీని ప్రారంభించనున్నారు. 10.55 గంటలకు అధ్యక్ష ఎన్నిక ప్రకటనను సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించనున్నారు. 11 గంటలకు అధ్యక్ష హోదాలో సీఎం జగన్ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 11.15 గంటలకు పార్టీ నియమావళిలో సవరణలు ప్రవేశపెట్టనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు కీలక తీర్మానాలు సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. మొదటి రోజు ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కీలకంగా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Also Read: Monkeypox: ప్రపంచంపైకి మరో మహమ్మారి.. 59 దేశాలకు హెచ్చరిక
అందుకు తగ్గట్టు తీర్మానం రూపొందించారని సమాచారం. మరోవైపు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కొనసాగింపు డౌట్ గానే ఉంది. ఇప్పటికే ఆమె తెలంగాణ లోని వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. రెండు పార్టీలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉండడం కుదిరే పని కాదు. దీనీకి నిబంధనలు అడ్డువస్తున్న ద్రుష్ట్యా ఆమె తేల్చుకోవాల్సి ఉంది. కాగా తొలిరోజు సమావేశాలకు లక్ష మంది వైసీపీ శ్రేణులు వస్తాయని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ టిఫిన్లు, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను వైసీపీకి చెందిన ఐదు కమిటీలు ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తొలుత విశాఖలో ప్లీనరీ సమావేశాలు ఏర్పాటుచేయాలని భావించినా.. 2017లో కలిసొచ్చిన ప్రదేశం కావడంతో మరోసారి అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే సీఎం జగన్ పేరిట ఆహ్వాన పత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో క్రియాశీలక నాయకులకు, కార్యకర్తలకు అందాయి. ప్లీనరీ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ సీఎం జగన్ స్వయంగా రాసినట్టు లేఖలను నేతలు రూపొందించి అందరికీ అందించారు.
సీఎం ప్రసంగంపైనే ఆసక్తి
అయితే ఈ రెండు రోజుల పాటు కీలక ప్రసంగాలు చేసే అవకాశముంది. 2024 ఎన్నికలకు సమరశంఖం పూరించనున్నారు. గత ప్లీనరీ సమావేశాల్లో ఆయన పార్టీ పరంగా కీలకాంశాలను వెల్లడించిన నేపథ్యంలో.. ఈ సారి కూడా స్పష్టమైన ప్రకటనలు ఉంటాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశముంది. గత కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో విపక్షాలు కూటమి దిశగా అడుగులేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే అధికార పక్షానికి దీటుగా ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలకు ఏమాత్రం అడ్వాంటేజ్ ఇవ్వకుండా శ్రేణులకు జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసే అవకాశముంది. గడిచిన 2017 ప్లీనరీలో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను సైతం సభకు పరిచయం చేశారు. ఈ సారి పీకే బిహార్ కు పరిమితం కావడంతో కొత్త పరిశీలకుడ్ని పరిచయం చేస్తారని అంతా భావిస్తున్నారు. మరోవైపు చాలాచోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెల్లుబికుతున్న తరుణంలో మార్పులపై కూడా ఆయన కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి కొద్ది గంటల్లో సీఎం జగన్ అన్ని అంశాలపై స్పష్టతనిచ్చే అవకాశముంది.
Also Read:Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్రంప్ లాంటి వాడేనా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp plenary from today jagan as permanent president of ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com