Colonel Harland Sanders : విజయానికి కొలమానం ఉండదు. విజేతకు ఒక వయసు అంటూ ఉండదు. ఇది ఈ ముసలాయన జీవితంలో నిజమైంది. అతని వయసు అప్పటికి 65 సంవత్సరాలు. జీవితంలో పెద్దగా విజయం సాధించలేదు. భారీగా వెనకేసుకోలేదు.. కాకపోతే తన ఆర్థిక భద్రతకు సంబంధించిన భయం అతనిలో కలిగింది. దీంతో వ్యాపారం చేయాలని భావించాడు. పెద్దపెద్ద ప్రయోగాలు ఎందుకు అనుకొని.. రోజు తినే చికెన్ పై ప్రయోగాలు చేశాడు.. సక్సెస్ అయ్యాడు. చివరికి తన పేరు మీదనే ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. అతడే కేఎఫ్ సీ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. ఈయన యుక్త వయసులో ఎన్నో వ్యాపారాలు చేశాడు. వేటిల్లోనూ విజయం సాధించలేదు. చివరికి 65 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్థిక భద్రత పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న ఎనిమిది వేల తో వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నాడు. వేరే వేరే ఎందుకని.. అందరూ ఇష్టంగా తినే చికెన్ పై ప్రయోగాలు మొదలుపెట్టాడు. అది తింటే తాను మాత్రమే గుర్తు రావాలని ఉద్దేశంతో రెసిపీ తయారు చేసుకున్నాడు. ఇందుకు తన వద్ద ఉన్న వనరులు మాత్రమే ఉపయోగించుకున్నాడు. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రెప్ప వాల్చకుండా కష్టపడ్డాడు. అయితే ఇలా ఆయన తయారు చేసిన రెసిపీలు హోటల్ వాళ్లకు తీసుకువెళ్లి చూపిస్తే.. వారు తిరస్కరించేవారు. ఇలా ఒక వెయ్యి తొమ్మిది సార్లు ఆయన తయారుచేసిన ఫ్రైడ్ చికెన్ రెసిపీలను రెస్టారెంట్ల యజమానులు తిరస్కరించారు. చివరికి ఒకరోజు తన వద్ద ఉన్న మజ్జిగలో చికెన్ మొత్తాన్ని నానబెట్టాడు. దానిని బ్రెడ్ పౌడర్ లో దొర్లించాడు. తను తయారు చేసుకున్న మసాలా మిశ్రమంలో మంచి.. నూనెలో దోరగా వేయించాడు. దానిని రెస్టారెంట్ యజమానులకు రుచి చూపించాడు. దీంతో వారు ఆ టేస్ట్ కు ఫిదా అయ్యారు. వెంటనే ఆర్డర్లు ఇచ్చారు. అలా కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. దానికి వెంటనే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని పేరు పెట్టాడు. అది జనాల్లోకి విస్తృతంగా వెళ్ళింది. 1964 నాటికే అది ప్రపంచ వ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది.
ఆరోజుల్లో 16 కోట్లకు
అయితే తన బ్రాండ్ ను కల్నల్ ఆరోజుల్లో 16 కోట్లకు విక్రయించాడు. ఇప్పటి కరెన్సీ వ్యాల్యూ ప్రకారం చూసుకుంటే అది 144 కోట్లకు సమానంగా ఉంటుంది. ఆ బ్రాండ్ తో కల్నల్ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని అతడు ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఇప్పుడు కేఎఫ్ సీ అనేది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద బ్రాండ్ గా అవతరించింది. కేఎఫ్ సీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ దానిని బీట్ చేయలేకపోయాయి. ఇకపై బీట్ చేసే అవకాశం కూడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఫ్రాంచైజీలతో కేఎఫ్ సీ వర్ధిల్లుతోంది. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. లక్షల మంది ఆకలి తీర్చుతోంది. చికెన్ లో కొత్త కొత్త వెరైటీలను పరిచయం చేసింది. పరిచయం చేస్తూనే ఉంది.. నగెట్స్, ఫుల్ బర్డ్, హాఫ్ బర్డ్, వింగ్, జాయింట్ వింగ్, లెగ్ పీస్.. ఇలా ఎన్నో రకాల చికెన్ వంటకాలను వినియోగదారులకు పరిచయం చేసింది. లేటు వయసులో విశ్రాంతి తీసుకోకుండా.. చేతిలో ఉన్న 8,0000 అయిపోతే పరిస్థితి ఏంటి అని భయపడకుండా.. ధైర్యంగా ముందడుగు వేశాడు. వెయ్యికి పైగా ప్రయోగాలు చేసినా వెనకడుగు వేయకుండా.. విజయవంతమయ్యాడు. కేఎఫ్ సీ పేరుతో తనే ఒక బ్రాండ్ గా అవతరించాడు. గెలుపు పాఠం అంటే ఇదే అని నిరూపించాడు. గెలుపుకు ఒక పాఠం కావాలంటే చాలా కష్టపడాలని చేతల్లో చూపించాడు.