PM Modi: భూటాన్ దేశం జిడిపిలో గాని.. ఎగుమతుల విషయంలో గాని.. రక్షణ రంగ విషయంలో గాని.. టెక్నాలజీ పరంగా గాని.. భారత్ తో పోటీ పడలేదు. పోటీపడే అవకాశం కూడా లేదు. కానీ ఈ దేశ రాజు జిగ్మే కేసర్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ విశేషమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు ఆయనను కలిశారు. ఈ ఏడాదిలో నరేంద్ర మోడీ ఎన్నిసార్లు అమెరికా అధ్యక్షుడిని కూడా కలవలేదు. చివరికి రష్యా అధినేత పుతిన్ తో కూడా భేటీ కాలేదు. అంత చిన్న దేశానికి రాజైన జిగ్మే కేసర్ కు మోడీ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది అంతుపట్టకుండా ఉంది. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి.. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలి సారి భూటాన్ లోనే పర్యటించడం విశేషం. వాస్తవానికి భూటాన్ తో భారత వాణిజ్యం తక్కువే ఉంటుంది. అయితే ప్రతిసారీ మోడీ జిగ్మే కేసర్ భేటీ అయినప్పుడు పొరుగు దేశాల సహకారం కోసం మాత్రమే అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీరిద్దరి భేటీల వెనుక ఏదో ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
చికెన్ నెక్ కోసమేనా..
సిలిగురి కారిడార్ ను చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉన్నదారి. ఇది 20 నుంచి 22 కిలోమీటర్ల ఇరుకైన మార్గంలో ఉంటుంది. కాకపోతే ఇది భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది. ఈ కారిడార్కు రెండు పక్కల నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి. దీనికి చివరన భూటాన్ ఉంది. 1975లో భారత్ లో విలీనం అయ్యేనాటికి సిక్కిం ఈ కారిడార్ కు ఉత్తరం వైపున ఉండేది. సిలిగురి ప్రాంతం పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది. ఇది తక్కువ వెడల్పుతో ఉంటుంది కాబట్టి చికెన్ నెక్ అని పిలుస్తుంటారు. అయితే చికెన్ నెక్ గా పేరుపొందిన ఈ దారిని గోట్ నెక్ గా మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం భూటాన్ సహాయం భారత్ కోరినట్టు తెలుస్తోంది. అందువల్లే నరేంద్ర మోడీ వరుసగా భూటాన్ లో పర్యటిస్తున్నారని సమాచారం. చికెన్ నెక్ ను సవాల్ చేస్తూ చైనా ఇటీవల ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులను నిర్మించడం మొదలుపెట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనివల్ల భారత్ కు భవిష్యత్ కాలంలో ఇబ్బందులు తప్పవు. దాన్ని గుర్తించే ముందుగా భారత్ చికెన్ నెక్ దారిని విస్తరించే పనిలో పడింది. దీనిని గోట్ నెక్ గా మార్చి.. ఈశాన్య రాష్ట్రాలలో సరికొత్త గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా చైనాకు చెక్ పెట్టాలని నరేంద్ర మోడీ బలమైన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే భూటాన్ రాజుతో వరుసగా భేటీ అవుతున్నారు.