Britain Economy Crisis: ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటోంది.2024 లెక్కల ప్రకారం బ్రిటన్ అప్పులు దేశ ఆదాయానికి 99.5 శాతానికి చేరుకున్నాయి. 14.1 మిలియన్ల మంది (ఇందులో 3.8 మిలియన్ల మంది పిల్లలు కూడా ఉన్నారు) ఆహార అస్థిరతతో బాధపడుతున్నారు. 2 మిలియన్ల మంది కనీసం ఒక రోజైనా ఆహారం లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి బ్రిటన్ యూరోపియన్ యూనియన్(EU) నుంచి బయటకు రావడమే అని కొందరు అంటున్నారు. అసలు ఈయూ నుంచి బ్రిటన్ ఎందుకు బయటకు వచ్చింది? తరువాత ఏం జరిగింది?
European Union అనేది యూరప్‌లోని అనేక దేశాల ఆర్థిక, రాజకీయ కూటమి. సభ్య దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, ప్రజల రాకపోకలు సులభంగా జరిగేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. బ్రిటన్ 1973లో ఈ కూటమిలో చేరింది. దశాబ్దాల పాటు సభ్యదేశంగా కొనసాగింది. అయితే ఈయూలో ఉండడం వల్త తమకు తీవ్రంగా ఆర్థిక నష్టం చేకూరుతుందని.. యూరోపియన్ లో ఉన్న దేశాలు ఎక్కువగా బ్రిటన్ సేవలను పొందుతున్నారని భావించారు. అంతేకాకుండా ఈ యూనియన్ లో ఉండడం వల్ల కొన్ని దేశాల ప్రజలు ముఖ్యంగా యూనియన్ లో ఉన్న తూర్పు దేశాలు ఎక్కువగా బ్రిటన్ కు వలసలు రావడం ఎక్కువైంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని ఆందోళన చేయడం ప్రారంభించారు.
2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో స్వల్ప మెజారిటీ ప్రజలు EU నుంచి బయటకు రావాలని ఓటు వేశారు. దీనినే ‘బ్రెగ్జిట్’ (Brexit) అంటారు. Britain , Exit అనే పదాల కలయికతో ఈ పేరు వచ్చింది. వలసలను నియంత్రించుకోవడం, తమ చట్టాలపై పూర్తి నియంత్రణ పొందడం, EU నియమాల నుంచి విముక్తి పొందడం వంటి కారణాలతో చాలా మంది బ్రిటిష్ ఓటర్లు బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చారు.దీంతో 2020లో బ్రిటన్ అధికారికంగా EU నుంచి వైదొలిగింది.
కానీ ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. అప్పటి వరకు యూరప్‌తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థలో మార్పులు వచ్చాయి. కొత్త కస్టమ్స్ నిబంధనలు, సరిహద్దు తనిఖీలు, అదనపు పత్రాలు వ్యాపార వ్యయాలను పెంచాయి. అలాగే వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, రవాణా రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. దీనివల్ల కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటికి తోడు కరోనా సంక్షోభం కూడా రావడంతో ఈ దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం బ్రిటన్ ఇంకా ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగానే ఉంది. United Kingdom కు బలమైన ఆర్థిక సేవల రంగం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిశ్రమలు ఉన్నాయి. అయితే అప్పుల నియంత్రణ, గృహ నిర్మాణం, ఉత్పాదకత పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లను అధిగమించగలిగితే బ్రిటన్ మళ్లీ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
