Donald Trump: ట్రంప్ రావడం.. భారత్, రష్యా, ఇజ్రాయిల్ కు ఎందుకు ఆనందంగా ఉంది?

ఎవరు ఎలా అనుకున్నా.. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఇవాల్టికి ప్రపంచం మీద పెత్తనం సాగించేది ముమ్మాటికి అమెరికానే. ఆర్థికంలో గాని.. శాస్త్ర సాంకేతిక రంగాలలో గాని.. వ్యాపారంలో గాని అమెరికా మిగతా దేశాలతో పోల్చితే అందనంత ఎత్తులో ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 7, 2024 12:44 pm

Donald Trump

Follow us on

Donald Trump: ప్రపంచ కర్మగారంగా చైనా వెలుగొందుతున్నప్పటికీ.. అమెరికానే నేటికీ చైనా దేశానికి ప్రధాన దిగుమతి దారుగా ఉంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇక నిన్నటిదాకా అమెరికాను పరిపాలించిన బైడన్.. డిసెంబర్ తర్వాత మాజీ అధ్యక్షుడు కానున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా తన పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ ను పోటీలో నిలబెట్టినప్పటికీ ఆమె ట్రంప్ దూకుడు ముందు తలవంచక తప్పలేదు. మొత్తంగా చూస్తే అమెరికాలో ట్రంప్ 2.0 జనవరి నుంచి ప్రారంభం కానుంది. అక్రమ వలసలు, పడిపోతున్న వాణిజ్యం, నేల చూపులు చూస్తున్న అమెరికా తయారీ రంగం, స్థానికులకు ఉపాధి అవకాశాలు అనే హామీలతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తారని తెలుస్తోంది. గతంలో హెచ్ 1 బీ1 వీసా పై పని చేసే వారికి అమెరికా జాతీయులతో సహా వేతనాలు అందించే విధంగా చట్టాలను సవరించిన ట్రంప్.. ఈసారి కూడా అదే స్థాయిలో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే ట్రంప్ ప్రతినిధి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాలోని మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వ్యవహారాలలోనూ ట్రంప్ స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తారని ప్రచారం జరుగుతోంది. ట్రంప్ రావడం పట్ల ఆసియాలోని ఇజ్రాయిల్, ఇండియా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా కూడా ఒకింత సంబరపడుతున్నది. ఇక యూరప్ లోని ఉక్రెయిన్, ఆసియాలోని ఇరాన్, చైనా, బంగ్లాదేశ్ ట్రంప్ రాకపట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.


భారత్

ట్రంప్ మొదటి నుంచి కూడా భారతదేశాన్ని తమకు అత్యంత ఇష్టమైన మిత్ర దేశంగా పేర్కొనేవారు. అప్పట్లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకెళ్లారు. హౌ డీ మోడీ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నరేంద్ర మోడీని గొప్ప నాయకుడని ట్రంప్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. భారత్ – అమెరికా దేశాలు పసిఫిక్ సముద్రంలో చైనా దూకుడును కట్టడి చేయడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నాయి.. సైనిక అవసరాలు, ఇతర వాణిజ్య సహకారాలపై కూడా ఒప్పందాలు జరిగాయి. అక్రమ వలసల విషయంలో ఉక్కు పాదం మోపుతానని చెబుతున్న ట్రంప్.. భారత్ విషయంలో కాస్త మెతక వైఖరి అవలంబిస్తారని తెలుస్తోంది. గతంతో పోల్చితే ఈసారి భారత్ – అమెరికా మధ్య ద్వేపాక్షిక వాణిజ్యం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇజ్రాయిల్, రష్యా

శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇజ్రాయిల్, రష్యా తో మొదటి నుంచి కూడా అమెరికా స్నేహపూర్వక వైఖరి అవలంబిస్తోంది. బైడన్ కాలంలో ఇజ్రాయిల్, రష్యా మధ్య సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేసినప్పుడు.. అమెరికా నాటో దళాలకు అనుకూలంగా మాట్లాడింది. అమెరికా అధ్యక్షుడు ఒకానొక సందర్భంలో ఉక్రెయిన్ లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఏకాంతంగా మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అది సహజంగా రష్యాకు నచ్చలేదు. ఆ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాపై నేరుగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇజ్రాయిల్ ఇటీవల పాలస్తీనా, ఇరాన్ దేశాలతోపాటు, హమాస్, హెజ్ బొల్లా వంటి ఉగ్రవాద సంస్థల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి క్రమంలో అమెరికా ఇజ్రాయిల్ కు అంతగా అండదండలు అందించలేదు. పైగా ఇజ్రాయిల్ తన శత్రువులపై దాడులు చేస్తున్నప్పుడు.. అమెరికా సిరియాపై దాడులు చేసింది. దీంతో తనకు సహాయం కావాలని ఇజ్రాయిల్ అడగలేని పరిస్థితిని కల్పించింది.. అయితే ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కావడంతో ఇజ్రాయిల్ , రష్యా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ హయాంలో గతంలో ఈ దేశాలు అమెరికాతో వ్యూహాత్మక వ్యాపారాన్ని, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని కొనసాగించాయి. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆ రెండు దేశాలు మునిపటి పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా అదే దిశగా సంకేతాలు ఇచ్చారు.