Donald Trump: ఈ నాలుగేళ్లు అమెరికాతో ఉక్రెయిన్, ఇరాన్, చైనా రాసుకుపూసుకు తిరిగాయి. పైకి వైరాన్ని ప్రదర్శించినప్పటికీ.. అంతర్గతంగా మాత్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగించాయి. ఆ మద్య ట్రంప్ పై కాల్పులు జరిగినప్పుడు చైనా మీడియా.. బైడన్ కు అనుకూలంగా రాతలు రాసింది. అక్కడి పోలీసులు వెంటనే స్పందించారని చెప్పుకొచ్చింది. మొహమాటం లేకుండా ట్రంప్ ది తప్పు అనే విధంగా వార్తలు రాసింది. చైనాలో ప్రైవేట్ మీడియా అంటూ ఉండదు. అక్కడ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే మీడియా నడుస్తుంది. దీనిని బట్టి చైనా అంతర్గతంగా ఎలాంటి ఉద్దేశం ఉందో అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచ కర్మగారంగా చైనా వెలుగొందుతోంది. చైనా ఆ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి ప్రధాన కారణం అమెరికా అంటే అతిశయోక్తి కాకమానదు. ఈ నాలుగేళ్లు.. అంటే బైడన్ అమెరికాను పరిపాలించిన కాలంలో.. చైనా దేశానికి ప్రధాన దిగుమతి దారుగా అమెరికా కొనసాగింది. ఆపిల్ ఫోన్ అసెంబ్లింగ్ నుంచి మొదలు పెడితే.. టీ షర్టుల వరకు చైనా మీదనే అమెరికా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాకు, చైనాకు మధ్య జిడిపి వ్యత్యాసం చాలా ఉన్నప్పటికీ.. ఈ నాలుగేళ్ల కాలంలో అది కాస్త తగ్గిందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. పైగా బైడన్, కమల కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు. అందువల్లే ఈ నాలుగు సంవత్సరాలు చైనా తో ప్రత్యక్షమైన విరోధాన్ని అమెరికా కోరుకోలేదు. చైనాను విమర్శిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రపంచ వేదికల వద్ద వివిధ దేశాలు చైనాపై ఆరోపణలు చేసినప్పటికీ.. అమెరికా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇక ప్రస్తుతం కమల ఓడిపోవడంతో చైనా డైలమాలో పడింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ట్రంప్.. అమెరికాలో తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ ప్రకారం చూసుకుంటే చైనా మీద అమెరికా ఆధారపడే విధానం క్రమక్రమంగా తగ్గుతుందని తెలుస్తోంది. వర్క్ ఆర్డర్లు పడిపోతాయని సమాచారం. ఇదే జరిగితే చైనా ఆర్థిక రంగం కుప్పకూలడం ఖాయం.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉన్నప్పుడు.. ఆ దేశానికి సముద్ర తీర ప్రాంతంలో పాగా వేయడానికి అమెరికా ప్రయత్నించింది. దానికి బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వైఖరిని అమెరికా నేరుగానే ప్రశ్నించింది. కొంతకాలానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రి అమెరికాకు వంత పాడుతున్నారు. ముఖ్యంగా బైడన్ కు అంతర్గతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఆలోచనలో పడ్డారు. ఆ సముద్ర తీర ప్రాంతంలో అమెరికా ఇప్పటికిప్పుడు పాగా వెయ్యకపోయినప్పటికీ.. బైడన్ అనుకూల ప్రధానమంత్రిపై ట్రంప్ నిర్లక్ష్య పూరితమైన ధోరణి ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు బంగ్లాదేశ్లో హక్కుల హననం జరుగుతోందని ఇటీవల పెద్ద పెట్టున వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని అమెరికా గనుక సీరియస్ గా తీసుకుంటే బంగ్లాదేశ్ ఇబ్బంది పడక తప్పదు..
ఇరాన్, ఉక్రెయిన్
ఇరాన్ దేశానికి బైడన్ అత్యంత దగ్గరి స్నేహితుడిగా కొనసాగారు. పలు వేదికల వద్ద ఇరాన్ దేశాధినేత, బైడన్ పరస్పరం అభినందించుకున్నారు. అమెరికాకు సంబంధించి చమురు, గ్యాస్ ఒప్పందాలు ఇరాన్ దేశంతో కుదుర్చుకుంది. ఇవన్నీ కూడా బైడన్ కాలంలోనే జరిగాయి. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ తో పెద్దగా వాణిజ్య అవసరాలు, వ్యాపారాలు సాగేవి కావు. కానీ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి.. ఇరాన్ తో సాగించే వ్యాపారంలో పునరాలోచన చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడం పట్ల ఆందోళన చెందుతోంది. ఇటీవల రష్యా యుద్ధం చేసినప్పుడు.. అమెరికా ఉక్రెయిన్ కు అండదండలు అందించింది. నాటో దేశాలతో పాటుగా సహాయ సహకారాలు చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడన్ నేరుగా ఉక్రెయిన్ వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా నుంచి ఉక్రెయిన్ కు అలాంటి సహకారం లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పుతిన్ కు అత్యంత అనుకూలమైన వ్యక్తిగా ట్రంప్ కు పేరుంది. దీంతో ఆయన రష్యా వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు ఉక్రెయిన్ పై రష్యా మరింత దూకుడుగా వెళ్లొచ్చు. అయితే ఆర్థిక ఇబ్బందులతో సత మతమవుతున్న రష్యా.. అలాంటి నిర్ణయం ఇప్పుడు తీసుకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.