Sheikh Hasina : హసీనాని అప్పగించమని బంగ్లాదేశ్ కోరితే మోదీ ఏం చేస్తారు? ఏ నిర్ణయమైనా అంత ఈజీ కాదు..

కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, తాత్కాలిక ప్రధాని మధ్య పరిస్థితి ఇలాగే ఉంది. దీనివల్ల భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం ముందు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 16, 2024 9:31 pm

Modi Sheikh Hasina

Follow us on

Sheikh Hasina : బంగ్లాదేశ్ లో నెలకొన్న రిజర్వేషన్ల ఉద్యమం వల్ల అక్కడి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ దేశానికి శరణార్థిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆర్మీ విమానంలో కోల్ కతా మీదుగా భారత్ వచ్చారు. తనను శరణార్థిగా ప్రకటించమని బ్రిటన్ దేశానికి అభ్యర్థనను పంపారు. అయితే ఇంతవరకు బ్రిటన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆమె భారత భూభాగంలోనే ఉన్నారు. భారత ప్రభుత్వం ఆమెకు వసతి, రక్షణ వంటివి కల్పిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు తాలూకూ అల్లర్లు ఇంకా తగ్గలేదు. అయితే ఈలోపు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా మీద కేసులు నమోదు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఆమె మీద 150 కి పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. కేసులు నమోదైన నేపథ్యంలో షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ కోరుతున్నారు. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరికలు పంపారు. యూనస్ హెచ్చరికల నేపథ్యంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అలా కుదరకపోవచ్చు

షేక్ హసీనా పరిపాలన కాలంలో బంగ్లాదేశ్ భారతదేశంతో మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగించేది. ఆసియా ఖండంలో భారతదేశానికి నమ్మకమైన దేశంగా ఉండేది. బ్రహ్మపుత్ర నది వరదలు బంగ్లాదేశ్ ను ముంచెత్తినప్పుడు అప్పటి ప్రధాని షేక్ హసీనా కేవలం భారత దేశ సహాయాన్ని మాత్రమే కోరారు. పలు సందర్భాల్లో ఆమె భారతదేశాన్ని సందర్శించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత దేశంలో పేరుపొందిన ఆదాని గ్రూపు బంగ్లాదేశ్లో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి పనులు చేస్తోంది. షేక్ హసీనా నాడు కుదుర్చుకున్న ఒప్పందం వల్లే ఆదాని గ్రూప్ లో అక్కడ పనులు చేస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్ శత్రుదేశం కోణంలోనే చూస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. భారత్ – బంగ్లాదేశ్ మధ్య వ్యవసాయ వస్తువులకు సంబంధించి ఎక్కువగా వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. దీని విలువ 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ..

మోడీ ఆ పని చేయరు

షేక్ హసీనా భారతదేశంలో శరణార్థిగా ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ కు అప్పగించబోరని వార్తలు వినిపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంతో మెరుగైన సంబంధాలను కొనసాగించారు. పైగా ఒక దేశానికి శరణార్థిగా వచ్చిన వ్యక్తి/ మహిళను మరో దేశానికి అప్పగించిన చరిత్ర ప్రపంచంలో లేదు. ఇప్పటికీ మన దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను అప్పగించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ వంటి వారు నేటికీ విదేశాలలోనే తల దాచుకుంటున్నారు. చివరికి అత్యంత పేరుమోసిన ఉగ్రవాదులను మన దేశానికి అప్పగించడంలోనూ ఇతర దేశాలు కాలయాపన చేస్తున్నాయి. పైగా ఆసియా ఖండంలో అన్ని దేశాలు భారత్ కు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హసీనాను బంగ్లాదేశ్ పంపించి.. మిత్ర ధర్మానికి మోడీ అన్యాయం చేయబోరని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అయితే షేక్ హసీనా ను దీర్ఘకాలం పాటు మనదేశంలో ఉంచుకోవడం కూడా మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు.. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యం మీద ప్రభావం చూపించే అవకాశం లేక పోలేదని వారు చెబుతున్నారు.