US Presidential Election: వారి నుంచి అమెరికాను ఎవరు కాపాడతారు..

బైడన్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత దేశంలోకి భారీగా వలసలు పెరిగిపోయాయి. సుమారు 40 లక్షల మంది అక్రమంగా దేశంలోకి వచ్చారని.. వారంతా శరణార్థులుగా బతుకుతున్నారని రామస్వామి ఆరోపిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 8, 2024 2:27 pm

US Presidential Election

Follow us on

US Presidential Election: మనదేశంలోనే కాదు.. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికల సందడి నెలకొంది. అక్కడ మొన్నటిదాకా రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి వివేక్ రామస్వామి పోటీపడ్డారు. అయితే చివరికి ఆ పోటీలో డోనాల్డ్ ట్రంప్ నెగ్గాడు. ఈ నేపథ్యంలో వివేక్ రామస్వామి మనసు మార్చుకుని రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వివిధ కౌంటీల్లో ట్రంప్ తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. జనాలకు ట్రంప్ అధ్యక్షుడు ఎందుకు కావాలో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. పలు సమస్యలపై గట్టిగా మాట్లాడుతూ.. అమెరికన్లలో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నారు.

వలసలు పెరిగిపోయాయి

బైడన్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత దేశంలోకి భారీగా వలసలు పెరిగిపోయాయి. సుమారు 40 లక్షల మంది అక్రమంగా దేశంలోకి వచ్చారని.. వారంతా శరణార్థులుగా బతుకుతున్నారని రామస్వామి ఆరోపిస్తున్నారు. అలా వచ్చిన వారికి అమెరికన్ చట్టాల ప్రకారం నెలకు 1000 డాలర్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోందని.. ఇలా చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటని? రామస్వామి ప్రశ్నిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ.. ఆయనకు అనుకూలంగా సాగిస్తున్న ప్రచారంలో ఈ అంశాలను రామస్వామి అత్యంత తెలివిగా లేవనెత్తుతున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం శరణార్థులుగా ఉన్నవారికి ప్రతినెలా వెయ్యి డాలర్లు ఇస్తారు. ఇలా కొంతకాలం తర్వాత అమెరికాలో బతకడానికి అవకాశాలు కల్పిస్తారు. ఇలా చేయడం వల్ల అమెరికా శరణార్థుల దేశంగా మారిపోతోందని రామస్వామి గట్టిగా వాదిస్తున్నారు. ఇక గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి జాతీయ భావాన్ని పెంపొందించే అంశాలనే ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు. “అమెరికాలో అమెరికన్లకే అవకాశాలు” అనే నినాదాన్ని ఆయన గట్టిగా నినదించారు.. ఆ ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా గెలుపొందారు. మరుసటి ఎన్నికల్లో బైడన్ చేతిలో ఓడిపోయారు..

మార్పు వస్తుందా?

ఇప్పటికే ట్రంప్ వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జైలు శిక్షను వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఇదే విషయాన్ని డెమొక్రటిక్ పార్టీ ప్రముఖంగా ప్రచారం చేస్తోంది.. అయితే రిపబ్లికన్ పార్టీ నాయకుడు రామస్వామి చేస్తున్న ఆరోపణలపై డెమొక్రటిక్ పార్టీ స్పందించడం లేదు. “అమెరికాలో మీ హయాంలోనే అక్రమంగా వలసలు పెరిగాయి కదా’ అని ప్రశ్నిస్తే స్పందించడం లేదు. డెమొక్రటిక్ నాయకులు అక్రమ వలసలపై స్పందించకపోవడంతో.. అమెరికాను వలసవాదుల నుంచి కాపాడాలంటే రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి రావాలని.. ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావాలని రామస్వామి ప్రచారం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

మద్దతు లభిస్తోంది

వివేక్ రామస్వామి చేస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.. అక్కడ మీడియా కూడా వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో రామస్వామి చేసిన వ్యాఖ్యలు అక్కడి యువతను ఆలోచింపజేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా రామస్వామి వ్యాఖ్యలకు సంఘీభావం తెలుపుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు “అమెరికా వలసవాదులకు ఎందుకు ఎర్రతివాచి పరుస్తోందని” ప్రశ్నిస్తున్నారు.. మరి ఇలాంటి సమయంలో ప్రస్తుత అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ సమాధానానికి అమెరికన్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.