US Government Shutdown: అమెరికా కాంగ్రెస్ నిధుల బిల్లును ఆమోదించకపోతే, ఫెడరల్ సేవలు నిలిచిపోవడం ‘గవర్నమెంట్ షట్‌డౌన్’గా పిలుస్తారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. నిధుల విడుదలపై పాలక రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య విభేదాలు మరింత ముదురడంతో కేంద్ర ప్రభుత్వ విభాగాలు స్తంభించాయి. 33 రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతోంది. లక్షలాది ఉద్యోగులకు జీతభత్యాలు నిలిచిపోయాయి.
నిలిచిపోయిన సబ్సిడీలు..
ప్రస్తుత షట్‌డౌన్ పేద అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 4 కోట్లకు పైగా ప్రజలకు లభించే ఆహార సబ్సిడీ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం ‘‘ఒబామా కేర్’’. దానికి కేటాయించిన ఫెడరల్ సబ్సిడీలు ఈ ఏడాది చివరతో ముగియనున్నాయి. వాటిని పొడిగించాలనే డెమోక్రాట్ల డిమాండ్‌ను రిపబ్లికన్లు తిరస్కరించడంతో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘డెమోక్రాట్లతో ఒప్పందానికి వెళ్లే ప్రశ్నే లేదు. చివరకు వారే మమ్మల్ని సంప్రదిస్తారు’’ అంటూ తన దృక్పథాన్ని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఈ సంక్షోభం త్వరగా ముగిసే అవకాశం కనిపించడం లేదు.
సెనెట్‌లో నంబర్ గేమ్..
100 సీట్ల సెనెట్‌లో నిధుల బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు అవసరం. ప్రస్తుతం రిపబ్లికన్లకు 53 మంది, డెమోక్రాట్లకు 45 మంది సభ్యత్వం ఉంది. ఇద్దరు స్వతంత్ర సభ్యులు రిపబ్లికన్ వైపున ఉన్నా, చట్టం ఆమోదం పొందాలంటే కనీసం ఐదుగురు డెమోక్రాట్లు మద్దతు ఇవ్వాలి. కానీ ఒబామా కేర్‌కు సబ్సిడీలు కొనసాగించాలనే వారి షరతుతో ఒప్పందం కుదరడం కష్టతరం అవుతోంది.
ఆర్థిక సంక్షోభం..
ఫెడరల్ సేవల నిలుపుదలతో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రవాణా, వాణిజ్య, పరిపాలనా విభాగాలు నిధుల కొరతో కుదేలవుతున్నాయి. అవసరమైన చెల్లింపులు నిలిచిపోవడం వల్ల స్థానిక వ్యాపారాలకు కూడా దెబ్బతగిలింది. మార్కెట్‌లో మానసిక అనిశ్చితి పెరిగి, స్టాక్ సూచీలు క్రమంగా కిందికి జారుతున్నాయి.
డెమోక్రాట్లు ఇది ట్రంప్ ప్రభుత్వ వైఫల్యం అని విమర్శిస్తుండగా, రిపబ్లికన్లు దేశ ఆర్థిక క్రమశిక్షణ కోసం తాత్కాలిక త్యాగం అవసరం అనే వాదనను ముందుకు తెస్తున్నారు. అయితే ప్రజా స్థాయిలో ఈ రాజకీయ పోరాటం ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఉద్యోగాలు, ఆహార భద్రతా పథకాలు, ఆరోగ్య సహాయం నిలిచిపోవడం సగటు అమెరికన్ కుటుంబాల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య సాగుతున్న ఈ రాజకీయ బేరసారాలు కేవలం బడ్జెట్ వ్యవహారం కాకుండా, అమెరికన్ ప్రభుత్వ వ్యవస్థ స్థిరత్వానికి పరీక్షగా మారాయి. ట్రంప్ కఠిన వైఖరి కొనసాగితే, త్వరలోనే పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉంది.