US Elections 2024: భారతీయులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం దశాబ్దాలుగా అమెరికా వెళ్లున్నారు. ఉన్నతమైన జీవితం, ఎక్కువ వేతనాలు, సెక్యూరిటీ తదితర కారణాలతో చాలా మంది అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. డాలర్ డ్రీమ్ నెరవేర్చుకునేందుకు అగ్రరాజ్యంవైపు చూస్తున్నారు. కొందరు కంపెనీల తరఫున అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. మరికొందరు ఉన్నత చదువుల కోసం హెచ్1బీ వీసాపై వెళ్లి.. తర్వాత అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు. గ్రీన్ కార్డు పొందుతున్నారు. ఇక భారతీయ టెకీలతో అమెరికాలో చాలా కంపెనీలు ఉన్నతంగా ఎదుగుతున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులను, ఉద్యోగార్థులకు అగ్రరాజ్యం రెడ్ కార్పెట్ వేస్తోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలో భారతీయ టెకీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేతనం విషయంలో కూడా కాంప్రమైజ్ కావడంలేదు. దీంతో చాలా మంది యూఎస్ కంపెనీలు, యూఎస్‌బేస్డ్ కపెనీల్లో జాబ్ కోసం విద్యార్థి దశ నుంచే కష్టపడుతున్నారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికా పంపించాలని కలలు కంటున్నారు. కొందరు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా పౌరసత్వం పొందారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులే రెండో స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటిస్థానంలో ఉంది. అమెరికా కాంగ్రెస్ నివేదిక ప్రకారం.. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందారు. ఇక ఈ ఏడాది చివరన అమెరికా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా పౌరసత్వం కోసం చాలా మంది భారతీయులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెరుగైన ఉద్యోగావకాశాలు, అధిక వేతనం, మంచి విద్య, అద్భుతమైన ఆరోగ్య సంరక్షణతోపాటు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు అమెరికా పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అంత ఈజీ కాదు…
అమెరికా పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. కఠినమైన ప్రక్రియ ఉంటుంది. అయినా.. వాటిని ఎదుర్కొనేందుకు భారతీయులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్లు పౌరసత్వం కోసం నమోదు చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2024 నవంబర్ 5న ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అమెరికా పౌరసత్వం పొందాలంటే కచ్చితంగా గ్రీన్‌కార్డు హోల్డర్ అయి ఉండాలి. అమెరికాలో ఉన్న గ్రీన్‌కార్డు హోల్డర్లలో ఎక్కువ మంది ఆసియా లేదా భారత దేశానికి చెందినవారే. ఐదేళ్లుగా గ్రీన్‌కార్డు హోల్డర్ అయినవారు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు అమెరికాలో ఉంటున్న భారతీయులు కొత్తగా గ్రీన్ కార్డు వచ్చినవారిని ప్రోత్సహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో సమాచారం ఇస్తున్నారు.
మూడు వారాల్లో పౌరసత్వం..
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కింద.. గ్రీన్ కార్డు హోల్డర్‌గా ఉన్నవారు. దాదాపు మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం పొందవచ్చు. కమలా హ్యారిస్‌కు మద్దతు తెలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ నేతలు కూడా భారతీయ గ్రీన్‌కార్డు హోల్డర్లను పౌరసత్వం నమోదుకు ప్రోత్సహిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లెక్కల ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో భారతీయ గ్రీన్‌కార్డు హోల్డర్లు 12.9 మిలియన్ల మంది ఉన్నారు. మరో 9.2 మిలియన్ల మంది అమెరికా పౌరసత్వానికి అర్హత పొంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరంతా పౌరసత్వం పొందడం ద్వారా ఓటువేసే అవకాశం పొందుతారు. 2023లో 59 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. యూఎస్‌సీఐఎస్ నివేదిక ప్రకారం.. 2023లో 8.70 మిలియన్ల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం పొందారు. వీరిలో మెక్సికో అగ్రస్తానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.