Pakistan UAE Loan Dispute: అప్పులు తీసుకుని ఎగ్గొట్టేవారు చాలా మంది ఉంటారు. ఇక దేశాలు చేసే అప్పుల విషయంలో అలా ఉండదు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సిందే. అయితే పాకిస్తాన్ అప్పులు ఎగ్గొట్టడంలో ప్రపంచంలో నంబర్ వన్. అందుకే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు పాకిస్తాన్‌కు రుణం ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. దీంతో డబ్బుల కోసం పాకిస్తాన్ అమెరికా వెంట పడుతోంది. తమ దేశంలో ఉన్న మినరల్స్, ఇతర వనరులు అప్పగించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి పాకిస్తాన్ అప్పులు తీసుకుంది. అయితే ఇటీవల ఇరాన్ దాడుల సందర్భంగా అమెరికా మద్దతుగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. ఈ సమయంలో యూఏఈకి అండగా ఉండాల్సిన పాకిస్తాన్ మౌనంగా ఉంది. దీంతో యూఏఈ గతంలో ఇచ్చిన 2 బిలియన్ డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. కానీ పాకిస్తాన్ స్పందించలేదు. దీంతో తాజాగా గట్టిగా హెచ్చరించింది.
తప్పించుకునే దారులు వెతుకుతున్న పాకిస్తాన్..
పాకిస్తాన్ అమెరికాతో స్నేహం, ట్రంప్‌తో సన్నిహితత్వం లేదా ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించడం వంటి అంశాల పేరుతో రుణ చెల్లింపును నిరాకరించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని గమనించిన యూఏఈ అప్పులు చేస్తావో.. ఆస్తులు అమ్ముతావో తెలియదు.. మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు ఇచ్చేయాలి అని స్పష్టం చేసింది. కథలు చెప్పడం వద్దు అని తేల్చి చెప్పింది.
ఇరకాటంలో పాకిస్తాన్..
పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ సంస్థల నుంచి సహాయం అందకపోయింది. అమెరికా ఒత్తిడి వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు డబ్బు ఇవ్వకపోగా, పాకిస్తాన్ యూఏఈ వైపు మొగ్గు చూపింది. అప్పుడు యూఏఈ 2 బిలియన్ డాలర్లు సహాయంగా అందించింది. ఇప్పుడు అదే డబ్బును తిరిగి కోరడం పాకిస్తాన్‌కు షాక్‌లా మారింది. ఇది పాకిస్తాన్ ఆర్థిక బలహీనతను బయటపెట్టింది. అంతర్జాతీయ రాజకీయాల్లో స్నేహ బంధాలు, భౌగోళిక రాజకీయ పాత్రలు ఆర్థిక బాధ్యతలను మించిపోవు. పాకిస్తాన్ అమెరికా, ట్రంప్‌తో సంబంధాలు లేదా ఇరాన్ సంబంధిత చర్చల్లో పాత్ర పోషించడం వంటి అంశాలు యూఏఈకి సంబంధించిన రుణాన్ని పక్కన పెట్టలేవు. యూఏఈ తన ఆర్థిక ప్రయోజనాలను ముందుంచి నిర్ణయం తీసుకుంటోంది. దీంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది.
దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్..
యూఏఈ హెచ్చరిక పాకిస్తాన్ ఆర్థిక స్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. రుణం చెల్లింపు వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఒత్తిడికి గురవుతాయి. ఇది విస్తృతంగా చూస్తే, చిన్న ఆర్థిక సామర్థ్యం ఉన్న దేశాలు బలమైన ఆర్థిక శక్తులపై ఆధారపడినప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను తెలియజేస్తుంది. రాజకీయ స్నేహాలు తాత్కాలికం కావచ్చు, కానీ రుణ బాధ్యతలు శాశ్వతం. పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.
యూఏఈ హెచ్చరిక అక్క అక్కే.. లెక్క లెక్కే అన్న సామెతను గుర్తు చేస్తోంది. స్నేహం ఉన్నంత మాత్రాన రుణం ఉచితంగా ఇవ్వం.. మాఫీ చేయం అన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది. పాకిస్తాన్ ఇలాంటి సంక్షోభాల నుంచి బయటపడాలంటే దీర్ఘకాలిక ఆర్థిక స్వావలంబన అవసరం.

