Helicopters Collided : జపాన్‌లో గగనతలంలో రెండు హెలిక్యాప్టర్లు ఢీకొన్న ఘటన మరువక ముందు.. తాజాగా మలేషియాలో మరో ప్రమాదం జరిగింది. సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలిక్యాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. శుక్రవారం(ఏప్రిల్ 26న) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం ఉంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలిక్యాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తు ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతం పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది.
పది మంది దుర్మరణం..
గగన తలంలో రెండు హెలిక్యాప్టర్లు ఢీకొన్న ఘటనలో పది మంది సిబ్బంది మరణించినట్లు మలేషియా అధికారులు ప్రకటించారు. వీరిలో ఇద్దరు లెప్టినెంట్ కమాండర్లు ఉన్నారు. హెలిక్యాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లోనూ నేవీ హలిక్యాప్టర్లే..
రెండు రోజుల క్రితం(ఏప్రిల్ 20న) జపాన్‌లో రాత్రి రెండు నేవీ విమానాలు ఢీకొన్నాయి. ఇవి సముద్రంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఏడుగురు గల్లంతయ్యారు. వారీ ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ క్రమంలో తాజాగా మలేషియాలోనూ నేవీ హెలిక్యాప్లర్లే గాల్లో ఢీకొని కుప్పకూలాయి.
https://twitter.com/i/status/1782625465167143399