Twitter staff vs Elon Musk :అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ పరిస్థితి. ప్రపంచంలోనే నంబర్ 1 అన్న తలపొగరో.. సాధించిన విజయాలు చూసి మురిసిపోయాడో ఏమో కానీ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ఎలన్ మస్క్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆయనకే ఎసరు తెచ్చిపెట్టింది. ట్విటర్ మనుగడనే ప్రమాదంలో పడేసింది. ట్విటర్ ను కొనుగోలు చేయగానే సీఈవో, సీఎఫ్ఓ లాంటి ఉన్నతాధికారులను తొలగించిన మస్క్ ఇటీవలే సగం మందిని తీసేసి షాకిచ్చాడు. ఉన్న వాళ్లు చేస్తే చేయండి లేదంటే పోండి అంటూ కఠిన నిబంధనలు పెట్టి హుకూం జారీ చేశారు.

ఎలన్ మస్క్ జారీ చేసిన హెచ్చరికతో ట్విటర్ ఉద్యోగులు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటికే సగం మందిని ఎలన్ మస్క్ తీసేయగా.. మిగిలిన సగం మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించి ఎలన్ మస్క్ కు గట్టి షాకిచ్చారు.
హార్డ్ కోర్ గా పనిచేయాలని.. ట్విటర్ 2.0ను నిర్మించడానికి కలిసి వచ్చేవారే ఉండాలని.. లేదంటే 36 గంటల్లో నిర్ణయం తీసుకొని వీడిపోవాలని.. వారందరికీ మూడు నెలల జీతంతో ఇంటికి పంపిస్తానంటూ ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఉద్యోగులు నొచ్చుకున్నారు. అందరూ ఏకమై మూకుమ్మడి రాజీనామాలు చేసేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ‘రిప్ ట్విర్, శాల్యూట్ ఎమోజీలు, ఫేర్ వెల్ మెసేజ్ లు పెట్టారు.’ ఇప్పుడు దీన్ని ట్విటర్ లోనే ట్రెండ్ చేశారు.
ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ అందులోని సగం మంది ఉద్యోగులను తీసేవాడు. మొత్తం 7500మంది ఉద్యోగుల్లో సగం మంది వైదొలగగా.. గురువారం సాయంత్రానికి కంపెనీలో 2900మంది మాత్రమే ఉన్నారు. వారూ రాజీనామా చేయడంతో సోమవారం వరకూ కార్యాలయాలను మూసివేస్తున్నామని ట్విట్టర్ తెలిపింది.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాల దెబ్బకు కంపెనీ మూతపడుతుందని భయపడిన ఎలన్ మస్క్ దెబ్బకు దిగి వచ్చాడు. ట్విట్టర్ కార్యకలాపాల్లో కీలకంగా భావించే కొంతమంది ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి గురువారం సామూహిక రాజీనామాలు విరమించుకోవాలని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఎలన్ మస్క్ మాట్లాడటం కొనసాగించినప్పటికీ కొంతమంది ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యలోనే నిష్క్రమించి గట్టి షాక్ ను ఇచ్చారు.
ఎలన్ మస్క్ దూకుడు నిర్ణయాల వల్లే బంగారం లాంటి ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు ఈ దురావస్థకు దిగజారింది. అన్నింట్లోనూ తన మాటే నెగ్గుతుందని భావించిన మస్క్ కు ఉద్యోగులు ఇచ్చిన షాక్ మామూలుగా లేదని అంటున్నారు. అయితే ఇంత జరిగినా ట్విటర్ ను సమాధి చేసినట్టు ట్రోల్స్ చేస్తున్నా కానీ మస్క్ తగ్గడం లేదు. ‘అది మునిగిపోనివ్వండి’ అన్నట్టు విజయ సంకేతం చూపించే ట్విట్ చేయడం గమనార్హం.
— Elon Musk (@elonmusk) November 18, 2022