Trump And Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం అందజేశారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న సంక్షోభంలో అమెరికా ప్రభుత్వం పాత్ర లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీనితో పాటు, “బంగ్లాదేశ్ సమస్యను నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వదిలివేస్తున్నాను” అని అన్నారు. ఈ సంయుక్త విలేకరుల సమావేశం తర్వాత, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తన సమావేశంలో బంగ్లాదేశ్‌లో ఇటీవలి పరిణామాలపై తన ఆందోళనలను పంచుకున్నారని అన్నారు.
వైట్ హౌస్‌లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించిన విదేశాంగ కార్యదర్శి, ఈ విషయం ఇద్దరు నాయకుల మధ్య చర్చలోకి వచ్చిందని అన్నారు. దీనితో పాటు, భారతదేశ పొరుగు దేశంలో పరిస్థితి రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాల వైపు కదులుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది. షేక్ హసీనా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. భారతదేశంతో ఆ దేశ సంబంధాలు గణనీయంగా క్షీణించాయి.
మోదీతో సమావేశంలో బంగ్లాదేశ్‌పై నిర్ణయాన్ని మోదీకే వదిలేస్తున్నా, ఇది ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో గత ఏడాది షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అదుపు చేసే క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఐక్యరాజ్యసమితి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో ఆ దేశ రాజకీయంగా వేడెక్కింది. బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను పదే పదే కోరుతోంది. హసీనా సామూహిక హత్యలకు పాల్పడ్డారని, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక వ్యవస్థలను నాశనం చేశారని యూఎన్ నివేదిక ఆరోపించిందని ఆ పార్టీ కీలక నేత తెలిపారు.
హింసాత్మక విద్యార్థుల నిరసనల తర్వాత షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమె భారతదేశంలోనే నివసిస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 600 గా అంచనా వేసింది. కానీ ఐక్యరాజ్యసమితి మరణాల సంఖ్యను దాదాపు 1400 గా పేర్కొంది. మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం ప్రజలను చంపుతోందని ఐక్యరాజ్యసమితి అప్పట్లో ఆరోపించింది. గత సంవత్సరం, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ను సందర్శించారు. ఈ సమయంలో భారతదేశం, బంగ్లాదేశ్ సత్సంబంధాలను కొనసాగించడానికి అంగీకరించాయి. కానీ రెండు దేశాల ఉద్రికత్త ఇటీవల కాలంలో పెరిగింది.