Narendra Modi Trump Meeting: “గద్దలను వేటాడేవాడు.. ఒక్కసారిగా రూపం మార్చుకుంటే శాంతి కాముకుడు అయిపోడు. జస్ట్ తన అవసరాలకు తగ్గట్టుగానే తన అవతారాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఆ మాత్రం దానికి అతడు గొప్పవాడని.. శాంతిని పరివ్యాప్తం చేసే వాడని అనుకోవద్దు. అలా అనుకుంటే మనకు మూర్ఖత్వం ఉందని చుట్టుపక్కల జనం భావిస్తుంటారు.” వెనుకటికి ఒక ఆఫ్రికన్ జానపదాన్ని తెలుగీకరిస్తే వచ్చిన అర్థం ఇది.
ప్రస్తుతం జి 7 సమ్మిట్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే పై ఉపోద్ఘాతం నిజమే అనిపిస్తోంది. తనకు అవసరం లేని యుద్ధంలో అమెరికా వేలు పెట్టింది.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పట్లో ఆ దేశం కోలుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. వేలాదిమంది చనిపోయారు. ఇరాన్ దేశం సుప్రీం నాయకత్వాన్ని కోల్పోయింది.. విలువైన వనరులను నష్టపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ దేశం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అమెరికాతో మొండిగా యుద్ధం చేసింది కాబట్టి సరిపోయింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఇంత ఉత్పాతాన్ని.. ప్రపంచం మీద ఆర్థిక భారాన్ని.. అమెరికా ప్రజలకు నరకాన్ని చూపించిన ట్రంప్.. శాంతి ప్రవచన కారుడు అయిపోయారు. చివరికి మన దేశ నావికులను చంపిన అమెరికా అధిపతి ఇప్పుడు గ్లోబల్ పీస్ లీడర్ గా మారిపోయారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. G7 సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి ప్రశంసించారు. హర్ముజు జల సంధి తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇండియన్ నావికుల భద్రత తనకు ముఖ్యమని.. వారి రక్షణకు కంకణ బద్దులుగా ఉండాలని కోరారు. దీనిపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. అంతేకాదు త్వరలో ఇండియాలో పర్యటిస్తానని మోడీకి మాట ఇచ్చారు. ట్రేడ్ డీల్ కూడా పూర్తి కావస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు ఆయనను ఏమాత్రం లెక్కపెట్టలేదు. పైగా అమెరికా సిబ్బందికి చుక్కలు చూపించారు. ట్రంప్ ను చైనా అధ్యక్షుడు ఆకాశానికి ఎత్తేయలేదు. కనీసం మనిషి మాదిరిగా కూడా చూడలేదు. కానీ నరేంద్ర మోడీ ఎందుకు ట్రంప్ ను పొగిడారు.. మన దేశానికి సంబంధించిన ముగ్గురు నావికులను చంపినప్పటికీ కూడా అలా ఎందుకు చేశారనేది ఇప్పటికి అర్థం కావడం లేదు.
