Elon Musk : ప్రపంచ కుబేరుడికి మంత్రి పదవి.. ఆఫర్‌ ఇచ్చిన ట్రంప్‌.. రెడీ అన్న మస్క్‌!

ఆయన ఓ బిజినెస్‌ మెన్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. కార్ల తయారీతోపాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం, ఇంకా అనేక వ్యాపారాలతో దూసుకుపోతున్నాడు.

Written By: Raj Shekar, Updated On : August 20, 2024 1:01 pm

Trump Offered minister post To Musk

Follow us on

Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాకు చెందిన మస్క్‌ ఈ ఏడాది నవంబర్‌/ డిసెంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల నిధుల కోసం మస్క్‌ రిపబ్లికన్‌ పార్టీకి భారీగా విరాళం ఇచ్చాడు. ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నాడు. తన సొంత సోషల్‌ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో ఇటీవల ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. సోషల్‌ మీడియ వేదికగా ట్రంప్‌ గెలుపు కోసం మస్క్‌ కృషి చేస్తున్నారు. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని మస్క్‌ తీవ్రంగా ఖండించారు. దీంతో ట్రంప్‌ కూడా మస్క్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వీలైనంత ఎక్కువగా మస్క్‌ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్‌.. ఎలాన్‌ మస్క్‌కు మరో ఆఫర్‌ ఇచ్చాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కు తన క్యాబినెట్లో చోటిస్తానని.. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ప్రకటించారు. మస్క్‌ చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. విద్యుత్‌ వాహనాలపై ఇస్తోన్న 7,500 డాలర్ల ట్యాక్స్‌ క్రెడిట్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ట్యాక్స్‌ క్రెడిట్లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డారు.

జేడీ.వాన్స్‌పై ప్రశంసలు..
రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ.వాన్స్‌ను ఎంపిక చేశారు. ట్రంప్‌ జేడీ.వాన్స్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. మరోవైపు ట్రంప్‌–మస్క్‌ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ మధ్యే ఇరువురూ ఎక్స్‌లో ఇంటర్వ్యూ తరహాలో వివిధ అంశాలపై చర్చించుకున్న విషయం తెలిసిందే. మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్‌ అనడం ఇది తొలిసారేం కాదు. 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్‌ను ఎంపిక చేశారు. కానీ, పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే మస్క్‌ రాజీనామా చేశారు. విద్యుత్‌ వాహన విక్రయాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఇస్తోన్న ట్యాక్స్‌ క్రెడిట్‌ను రద్దు చేసే యోచనలో ట్రంప్‌ ఉన్నారు.

అధికారంలోకి వస్తే నిబంధనల మార్పు..
ఇక ట్రంప్‌ అధికారంలోకి వస్తే మస్క్‌కు అనుకూలంగా నిబంధనలు మార్పు చేయడానికి రెడీ అవుతున్నారు. లేదా దానిని పూర్తిగా రద్దు చేసేలా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ తాజాగా వెల్లడించారు. అధిక ధరల వల్ల విద్యుత్‌ కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తాను పెట్రోల్‌ కార్ల తయారీ వైపు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.

మినిస్టర్‌ పదవికి రెడీ..
ఇదిలా ఉంటే.. ట్రంప్‌ ఇచ్చిన ఆఫర్‌కు మస్క్‌ కూడా రెడీ అన్నారు. తనను క్యాబినెట్లోకి తీసుకుంటానన్న ట్రంప్‌ ప్రతిపాదనపై ఎలాన్‌ మస్క్‌ సానుకూలంగా స్పందించారు. ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ’కి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్‌ వేదికగా మస్క్‌ వెల్లడించారు. ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని కూడా పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌ ఇటీవల జరిగిన చర్చలో మస్క్‌ ప్రతిపాదించారు.