Trump Netanyahu Phone Call: పశ్చిమాసియా దేశం ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నాయి. 50 రోజుల భీకర దాడిలో ఇరువైపులా నష్టం జరిగింది. అయినా ఇరాన్ లొంగిపోలేదు. దీంతో సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది. మరోవైపు ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాశ్వత ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రాక్సీ దేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ తీవ్రమైన వివాదానికి దారి తీసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైట్‌హౌస్ వర్గాల ధృవీకరణ..
ట్రంప్–నెతన్యాహూ ఫోన్ సంభాషణను వైట్ హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. ట్రంప్ నెతన్యాహుతో స్పష్టమైన, కఠినమైన భాషలో మాట్లాడారు. నెతన్యాహును ‘‘నీకు పిచ్చి పట్టింది..నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి,. అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు.. నీవల్ల ఇజ్రాయెల్‌కు చెడ్డ పేరు వస్తోంది’’ అని మండిపడినట్లు సమాచారం. ‘‘నేనే నిన్ను కాపాడుతున్నాను’’ అని కూడా వెల్లడించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ సంభాషణ ఇజ్రాయెల్ లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు మరింత తీవ్రతరం చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో జరిగింది. ట్రంప్ ఈ దాడులు తన ఇరాన్‌తో జరుపుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయని భావించారు.
ట్రంప్ కోపానికి కారణం ఏంటి?
ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తే ఇరాన్ అమెరికాతో జరుపుతున్న చర్చలను నిలిపివేస్తుందని హెచ్చరికలు వచ్చాయి. ఇది మధ్యప్రాచ్యంలో మరిన్ని సంక్షోభాలకు దారి తీస్తుందని ట్రంప్ భయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరుగుతోందని, దాని వల్ల అమెరికాకు కూడా నష్టం వస్తోందని ఆయన అభిప్రాయం. ట్రంప్ శైలి ఎప్పుడూ స్పష్టమైనది. సూటిగా ఉంటుంది. ఈసారి కూడా అదే భాషలో మాట్లాడటం ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉంది.
ఇజ్రాయెల్–అమెరికా సంబంధాల్లో కొత్త పరిణామం?
ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు ఎప్పుడూ బలమైనవిగా ఉంటాయి. అయితే ఈ ఘటన ఆ సంబంధాల్లో కొంత అసౌకర్యాన్ని బయటపెట్టింది. నెతన్యాహు తన దేశ భద్రతా ప్రాధాన్యతలను ట్రంప్ దౌత్య వ్యూహాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన సూచిస్తోంది. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనూ నెతన్యాహుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, తన ప్రధాన లక్ష్యమైన మధ్యప్రాచ్య శాంతి, ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇజ్రాయెల్‌ను కట్టుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
రెండు విషయాలు స్పష్టం..
ట్రంప్ తన ఎజెండాను (ముఖ్యంగా ఇరాన్‌తో దౌత్యం) ఎవరికైనా రాజీ పడకుండా అమలు చేస్తారు. నెతన్యాహు తన దేశ భద్రతా ఆందోళనలను ఎంత మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు స్థానం మరింత క్లిష్టంగా మారవచ్చు. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి, మరోవైపు స్వంత దేశంలో రాజకీయ ఒత్తిడి ఈ రెండింటి మధ్య నెతన్యాహు ఎలా సమతుల్యం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్–నెతన్యాహు మధ్య జరిగిన ఈ తీవ్రమైన సంభాషణ మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త టెన్షన్‌ను సృష్టించింది. ఇది కేవలం రెండు దేశాల అధినేతల మధ్య వ్యక్తిగత విభేదం కాదు.. ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు ఎలా పని చేస్తాయో చూపించే ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తత ఎలా ముగుస్తుందనేది ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
