Richest People: ఆకలి మంటలు ఒకచోట.. అన్నపు రాశులు ఒకచోట.. ఈ ముగ్గురి వద్దే ప్రపంచంలో సగం సంపద..

ప్రపంచంలో 8 బిలియన్ల జనాభా ఉంటే 2,781 మంది మాత్రమే బిలియన్ డాలర్ల సంపాదన కలిగి ఉన్నారు. అయితే మస్క్, బెజోస్, జుగర్ బర్గ్ మాత్రమే 200 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 26, 2024 8:41 am

Richest People

Follow us on

“అన్నపు రాశులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట

అలసిన దేహాలు ఒకచోట
హంస తూలికలు ఒకచోట

గంపెడు బలగం ఒకచోట
సంపదలన్నీ ఒకచోట

వాసన నిచ్చే నూనె ఒకచోట
మాసిన తలలు ఇంకొకచోట

అనుభవం ఒకచోట
అధికారం బందీ అయ్యింది ఒకచోట..”

Richest People: చదువుతుంటే ప్రపంచంలో అసమానత్వం కళ్ళ ముందు కదలాడుతోంది కదూ.. ఎప్పుడో వెనుకటి రోజుల్లో రాసిన ఈ కవిత.. నేటి వర్తమానానికీ సరిపోతోంది.

ప్రస్తుత ప్రపంచం మొత్తం టెక్నాలజీ చుట్టూ, సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఈ టెక్నాలజీని పరిచయం చేసినవాడు.. సోషల్ మీడియాను వాడుకలోకి తెచ్చినవాడు వేలకోట్లకు ఎదుగుతున్నాడు. లక్షల కోట్లకు తన సంపాదన పెంచుకుంటున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒక ఎత్తు. టెక్నాలజీ, సోషల్ మీడియా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఒక ఎత్తు. రఫ్ గా చెప్పాలంటే.. సోషల్ మీడియాను, టెక్నాలజీని వాడుకలోకి తెచ్చిన వాళ్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అంతకంతకు తమ సంపాదన పెంచుకుంటూ ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ న్యూరా లింక్స్, ట్విట్టర్ ఎక్స్, స్పేస్ ఎక్స్ లోకి ప్రవేశించిన తర్వాత తన సంపదను మరింత పెంచుకున్నారు. టెస్లా అధిపతిగా కంటే ఎక్స్ ఓనర్ గానే ప్రాచుర్యంలో పొందారు. ఏకంగా ఆయన సంపాదనను 268 బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు. ఈ సంపాదన ప్రపంచంలో మరెవరికీ లేదు. అందువల్లే ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. ఇతడి తర్వాత అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తన సంపాదనను 216 బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు.. మస్క్ తర్వాత రెండవ అతిపెద్ద శ్రీమంతుడిగా అవతరించారు. అమెజాన్ ను టెక్నాలజీ రంగంలోకి విస్తరించడంతో తన సంపాదనను బెజోస్ విస్తరించుకున్నారు. తాజాగా స్పేస్ యాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ జాబితాలోకి ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ కూడా చేరారు. ఆయన మెటా కంపెనీ ని ప్రారంభించి. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, థ్రెడ్స్ వంటి విభాగాలను ఏర్పాటు చేసి టెక్నాలజీ రంగాన్ని, సోషల్ మీడియా విభాగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏకంగా తన సంపాదనను 200 బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు.

8 బిలియన్ల జనాభా ఉంటే…

ప్రపంచంలో 8 బిలియన్ల జనాభా ఉంటే 2,781 మంది మాత్రమే బిలియన్ డాలర్ల సంపాదన కలిగి ఉన్నారు. అయితే మస్క్, బెజోస్, జుగర్ బర్గ్ మాత్రమే 200 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న సంపద లో దాదాపు 50 శాతం వీరి ముగ్గురి మధ్య ఉంది. ఈ క్లబ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఒరాకిల్ సహవ్యస్థాపకుడు లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ పోటీపడుతున్నప్పటికీ.. వారికి ఆశించిన స్థాయిలో అనుకూలతలు కనిపించడం లేదు.

సంపద పెరిగి.. ఉద్యోగాలను కోస్తున్నారు

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం వీరి ముగ్గురి సంపద అంతకంతకు పెరుగుతోంది. అయితే వీరు పెరిగిన సంపదకు తగ్గట్టుగా ఉద్యోగాలు సృష్టిస్తున్నారా? అంటే ఈ ప్రశ్నకు సమాధానం నో అనే వస్తుంది. అమ్మకాలు తగ్గిపోయాయని.. ఆర్థిక మాంధ్యం ఉందనే సాకుతో మస్క్, జెఫ్ బెజోస్, జూకర్ బర్గ్ వంటి వారు తమ కంపెనీలలో వేలాది మందిని అడ్డగోలుగా తొలగించారు. ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. కానీ, వారు మాత్రం తమ సంపాదన విస్తరించుకుంటూ పోతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి.. ఈ కథనం ప్రారంభంలో మేం ప్రస్తావించిన ” ఆకలి ఒకచోట.. అన్నపురాశులు ఒకచోట” అనే కవిత పంక్తి సరైనదే కదా?!