https://oktelugu.com/

వీకెండ్ స్పెషల్: కరోనాకు మూలం చైనా వన్యప్రాణుల పెంపక కేంద్రాలే

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ప్రపంచ దేశాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ వాటి మూలాలపై స్పష్టత రాలేదు. వీటిపై దర్యాప్తు చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయ్యే అవకాశాలను కొట్టిపారేసింది. ఇలా కోవిడ్‌ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్ మూలాలకు చైనాలోని వన్యప్రాణుల […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 20, 2021 / 11:25 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ప్రపంచ దేశాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ వాటి మూలాలపై స్పష్టత రాలేదు. వీటిపై దర్యాప్తు చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయ్యే అవకాశాలను కొట్టిపారేసింది. ఇలా కోవిడ్‌ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్ మూలాలకు చైనాలోని వన్యప్రాణుల పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు భావిస్తున్నారు.

    వూహాన్‌ మార్కెట్‌లోనే కరోనా వైరస్‌ తొలిసారిగా బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పంపిన జంతువుల ద్వారా కరోనా వైరస్‌ మనుషుల్లోకి వచ్చి ఉంటుందనే అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, ప్రజలకు ఉపాధి కల్పించడానికి వన్యప్రాణుల సంరక్షణని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వన్యప్రాణుల్ని పెంచి పోషించేవారు ఎక్కువగా పాంగోలిన్స్, పార్క్‌పైన్స్, పునుగు పిల్లులు, రాకూన్‌ శునకాలు, బాంబూ ఎలుకలు పెంచుతూ ఉంటారు. ఆ కేంద్రాల నుంచే వైరస్‌ వచ్చి ఉంటుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ త్వరలోనే పూర్తి స్థాయి అధికారిక నివేదిక విడుదల చేయనుంది.

    చైనాలో కరోనా వైరస్‌ బయటపడిన వెంటనే ఫిబ్రవరి(2020)లో ఈ కేంద్రాలను అక్కడి అధికారులు మూసివేశారు. తొలుత గబ్బిలాల నుంచి అక్కడ పెంచే జంతువులకు, అనంతరం‌ మానవులకు సంక్రమించి ఉండవచ్చని భావించిన చైనా ప్రభుత్వం వాటిని మూసివేసినట్లు డేస్‌జాక్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎలా కట్టడి చేయాలో అక్కడి రైతులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వన్యప్రాణులను చంపడం, వధించిన వాటిని పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడంపై వన్యప్రాణుల పెంపకందార్లకు చైనా ప్రభుత్వం తగు సూచనలు చేసిందని చెప్పారు.

    కానీ, ఇవి ఆ మార్కెట్‌కు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. వీటిపై దర్యాప్తు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా కోవిడ్‌ మూలాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమయంలో కరోనా వైరస్‌కు దక్షిణ చైనాలోని వైల్డ్‌లైఫ్‌ ఫామ్‌లు మూలమై ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది. అక్కడి నుంచి వుహాన్‌ మార్కెట్‌కు జంతువులను సరఫరా చేసే వాటిలో కోవిడ్‌కు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు దర్యాప్తులో పాల్గొన్న అమెరికా శాస్త్రవేత్త పీటర్‌ డేస్‌జాక్‌ స్పష్టం చేశారు. వైల్డ్‌లైఫ్‌ ఫామ్‌లలో లభించే వన్యప్రాణులకు తొలుత గబ్బిలాల నుంచి వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఆయా జంతువుల నుంచి కరోనా వైరస్‌ మానవులకు సోకినట్లు చైనా ప్రభుత్వం కూడా భావించినట్లు పీటర్‌ డేస్‌జాక్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    దక్షిణ చైనాలోని యున్నాన్‌ ప్రావిన్సులో గబ్బిలాల్లో లభ్యమైన వైరస్‌ సార్స్‌-కోవ్‌-2తో దాదాపు 96 శాతం పోలికను కలిగివుందని తేలింది. వీటికి తోడు ఆయా కేంద్రాల్లో పెంచే జంతువులు కూడా కరోనావైరస్‌ను వ్యాప్తి చేసేవే కావడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు డేస్‌జాక్‌ పేర్కొన్నారు. చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన దర్యాప్తులో ఇందుకు కావాల్సిన రుజువులు కనుగొన్నట్లు వెల్లడించారు. వుహాన్‌లో సీ ఫుడ్‌ మార్కెట్‌ను రాత్రికి రాత్రే మూసివేయడం వంటి చర్యలు చూస్తుంటే అక్కడ తీవ్ర స్థాయిలో వైరస్‌ వ్యాప్తి జరిగి వుంటుందని సింగపూర్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ లింఫా వాంగ్‌ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ దర్యాప్తు బృందంలో మరోసభ్యుడిగా ఉన్న లింఫా వాంగ్‌.. వైరస్‌ బయటపడిన తర్వాత ఆ ప్రాంతాన్ని చైనా శాస్త్రవేత్తలు వెళ్లి పరిశీలించారని చెప్పారు.

    వన్యప్రాణి కేంద్రాల్లో కరోనా వైరస్‌ మూలాలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, అక్కడి ప్రజలకు మాత్రం తొలుత ఈ వైరస్‌ వ్యాపించకపోవచ్చని డేస్‌జాక్‌ అభిప్రాయపడ్డారు. తొలి కేసు వుహాన్‌లోనే బయటపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దర్యాప్తు జరిపినప్పటికీ ఇంకా తుది నివేదిక విడుదల చేయలేదు. ఆ నివేదిక మరికొన్ని వారాల్లోనే విడుదల కానున్న నేపథ్యంలో దర్యాప్తు బృందంలోని సభ్యులు కొవిడ్‌ మూలాలపై తమకున్న సమాచారాన్ని వెల్లడించారు.