Son becomes Son in law: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె పెద్దదవుతుంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఒక అబ్బాయిని చూసి సంబంధం ఖాయం చేస్తారు. ఈలోగా అతడి వివరాలు తెలుసుకుంటే.. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇన్ని రోజులు తాము పెంచిన కూతురు తమ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి.. ఆమెనే కోడలిగా భావిస్తారు. తప్పిపోయిన తన కొడుకు కు ఇచ్చి పెళ్లి చేస్తారు.
ఇదంతా చదువుతుంటే వెనకటి కాలంలో సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదా. వాస్తవానికి ఇలాంటి సన్నివేశాలు రీల్ లైఫ్ లో తప్ప.. రియల్ లైఫ్ లో చోటు చేసుకోవడం దాదాపు అసాధ్యం. అయితే ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అది కాస్త మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. అంతేకాదు విధిరాతను ఎవరూ తప్పించలేరని మరోసారి రూఢీ అవుతోంది.
చైనాలో సుజో హు ప్రాంతంలో ఓ మహిళ కొన్ని సంవత్సరాల ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప మూడు సంవత్సరాల వయసులో తప్పిపోయింది. ఆ పాప కోసం అనేక చోట్ల తిరిగింది. ఎన్ని చోట్ల తిరిగినప్పటికీ ఆ పాప జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక మగ బిడ్డను ఆమె దత్తత తీసుకుంది.
ఆ మగ బిడ్డను తన సొంత బిడ్డగా పెంచుకుంది. మగ బిడ్డను పెంచుకుంటున్నప్పటికీ.. తన సొంత బిడ్డ జ్ఞాపకాల నుంచి ఆమె దూరం కాలేదు. ఆ తర్వాత తన పెంపుడు కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు. దీంతో అతనికి వివాహం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఒక సంబంధం నచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే ఆ మహిళకు తెగ నచ్చింది. ఇదే క్రమంలో ఆమె చేతి వైపు చూసింది. చిన్నప్పుడు ఆ మహిళ బిడ్డ మణికట్టు మీద మచ్చ వుండేది. ఆ మచ్చ అమ్మాయికి కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ మహిళ షాక్ కు గురైంది. ఆ తర్వాత ఆ యువతికి సంబంధించిన వివరాలు తెలుసుకుంది. అంతేకాదు ఆమె అనుమానించినట్టుగానే.. ఆ బిడ్డను ఆ దంపతులు వీధిలో దొరికితే పెంచుకోవడం మొదలుపెట్టారు. అదే విషయాన్ని ఆ మహిళతో కూడా చెప్పారు. దీంతో ఆ మహిళ తనకు, ఆ యువతికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించింది.. ఆ మహిళ కోరుకున్నట్టుగానే ఇద్దరి డిఎన్ఏ సరిపోలింది.
ఇన్ని సంవత్సరాలపాటు తప్పిపోయింది అనుకున్న తన బిడ్డ చివరికి తన దగ్గరకే వచ్చింది. అయితే ఆ పెళ్లి విషయంలో మాత్రం ఆ మహిళ ఒక రకమైన గందరగోళానికి గురైంది. ఎందుకంటే దత్త పుత్రుడికి.. పెంచుకున్న కుమార్తెకు వివాహం చేయడం సరికాదని ఆమెకు అనిపించింది. అయితే చుట్టుపక్కల బంధువులు ఆమెకు సర్దు చెప్పారు. ” నువ్వు పెంచుకున్నది దత్త కుమారుడిని. అతడు నువ్వు కన్న కొడుకు కాదు. అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేయవచ్చని” ఆ బంధువులు ఆమెకు సూచించారు.. దీంతో ఘనంగా వారిద్దరికీ పెళ్లి చేసింది. పెంచుకున్న కుమారుడు అల్లుడయ్యాడు. కోడలు అవుతుందనుకున్న యువతి కుమార్తె అయింది. దీనినే విధిరాత అంటారేమో.