https://oktelugu.com/

Bangladesh : అడుగడుగునా నరకం.. బయటికి వెళ్లాలంటే భయం.. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయం..

బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు హిందువులను టార్గెట్ చేశారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆలయాలను నాశనం చేస్తున్నారు. ఢాకా కు దగ్గరలో ఉన్న ఓ హిందూ ఆలయం పై అల్లరిమూకలు రెచ్చిపోయాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 / 10:03 PM IST

    Bangladesh

    Follow us on

    Bangladesh : అది ఓ ఇల్లు.. అందులో ఓ కుటుంబం నివసిస్తోంది.. ఈలోగా తలుపు చప్పుడయింది. అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు తలుపు తీయలేదు. దీంతో కొందరు మారణాయుధాలతో ఆ తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి ప్రవేశించారు. దొరికిన వస్తువులను దొరికినట్టే దోచుకున్నారు. ఆ ఇంట్లో వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఆడవాళ్ళపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సంఘటన జరిగింది ఎక్కడో ఆఫ్ఘనిస్తానో, పాకిస్తాన్ లోనో కాదు.. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో.. ప్రస్తుతం ఆ దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పరిపాలన మొత్తం సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది. మొన్నటిదాకా ప్రధాన మంత్రిగా కొనసాగిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న వారంతా తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆందోళనలతో దేశాన్ని అట్టుడికిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు నిప్పు పెడుతున్నారు.. క్రికెటర్ల ఇళ్లను కూడా వదలడం లేదు.. దీంతో క్రికెటర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. సైన్యం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు. ఈ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంగ్లాండ్ నుంచి పిలుపు అందలేదు. తనను రాజకీయ శరణార్థిగా ఆమె పేర్కొన్నప్పటికీ ఇంగ్లాండ్ ఇంతవరకు కనికరం చూపలేదు. దీంతో ఆమె భారత్ లోనే ఉండిపోవాల్సి వస్తోంది.

    హిందువులే టార్గెట్

    బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు హిందువులను టార్గెట్ చేశారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆలయాలను నాశనం చేస్తున్నారు. ఢాకా కు దగ్గరలో ఉన్న ఓ హిందూ ఆలయం పై అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఆ ఆలయంలో ఉన్న దేవతామూర్తుల ప్రతిమలను ధ్వంసం చేశాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. “హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడ ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదు. భారత ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతోంది. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే భయం వేస్తోంది.. అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు భద్రత కల్పించాలని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు..#all eyes on Bangladesh Hindus అనే యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

    ఇక బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.. అయితే ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి హిందువులను భారత్ తీసుకువచ్చే అవసరం లేదని జై శంకర్ స్పష్టం చేశారు..”అక్కడ పరిస్థితులు హిందువులను ఇక్కడ దాకా తీసుకొచ్చే స్థితిలో లేవు.. శాంతిభద్రతలు కట్టు తప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ మా జాగ్రత్తల్లో మేమున్నామని” జై శంకర్ ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడి వారిలో ఆగ్రహాన్ని కలగజేస్తున్నాయి.. ఆ దృశ్యాలు చూసేందుకు అత్యంత భయానకంగా ఉన్నాయి.. కొందరు హిందువులైతే తమను కాపాడాలని వేడుకుంటున్న దృశ్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. “ఇక్కడ మేము ఉండలేము. చాలా ఇబ్బంది పడుతున్నాం. అల్లరి మూకలు అలజడులు సృష్టిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని” ఓ హిందూ మహిళ వేడుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.