https://oktelugu.com/

Sheikh Hasina : షేక్ హసీనా రాజీనామా, దేశం విడిచి వెళ్లడానికి కారణం ఆమె తండ్రే.. ఎందుకంటే?

బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హసీనా నిర్ణయం తీసుకున్నారు. దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. సాధారణంగా ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని హసీనా కొత్తగా తీసుకురాలేదు. ఆమె తండ్రి దీనిని ప్రవేశపెట్టారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 6, 2024 / 12:09 PM IST
    Follow us on

    Sheikh Hasina : బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరుపొందిన షేక్ హసినా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అత్యంత అవమానకరమైన పరిస్థితుల మధ్య దేశం విడిచి వెళ్లిపోయారు. దేశం విడిచి వెళ్లడం ఆమెకు ఇది తొలిసారి కాకపోయినప్పటికీ.. గతంలో ఆమె తల్లిదండ్రులు హత్యకు గురైనప్పుడు ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో ప్రవాస జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఆమె బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. స్వల్ప ఆటుపోట్ల తర్వాత ఏకచత్రాధిపత్యంగా బంగ్లాదేశ్ దేశాన్ని పరిపాలించారు. తనదైన నాయకత్వ శైలితో బంగ్లాదేశ్ కు స్థిరమైన పరిపాలన అందించారు. దేశాన్ని గాడిలో పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు చేశారు. సరికొత్త విధానాల ద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు కొరకరాని కొయ్య అయ్యారు. ఒక్క మహిళగా పేరుగాంచారు. అయితే అంతటి గొప్ప చరిత్ర ఉన్న హసీనా ఉన్నట్టుండి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేశం వదిలి భారత్ వెళ్లిపోయారు. లండన్ లో ప్రవాస జీవితం గడిపేందుకు తరలిపోయారు. అయితే ఆమె రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే..

    రిజర్వేషన్ కోటా

    బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హసీనా నిర్ణయం తీసుకున్నారు. దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. సాధారణంగా ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని హసీనా కొత్తగా తీసుకురాలేదు. ఆమె తండ్రి దీనిని ప్రవేశపెట్టారు.. 1972లో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులకు 30 శాతం, విమోచన యుద్ధం, శత్రు సేనల చేతుల్లో ముత్యాలకు గురైన మహిళలకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది. 1996లో స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటాను బంగ్లాదేశ్ ప్రభుత్వం వారి పిల్లలకు విస్తరించింది. 2009లో స్వాతంత్ర సమరయోధుల మనవళ్లు, మనవరాళ్లకు ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013లో బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ ప్రిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలను చేపట్టారు. ఇదే సమయంలో 2018లో ప్రభుత్వ సర్వీసులలో నియామకాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావాలని బంగ్లాదేశ్ జనరల్ కేటగిరి విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా ప్రధమ, ద్వితీయ శ్రేణి ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారు బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో గతంలో ఉన్న కోటా పునరుద్ధరించారు. ఫలితంగా దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇక అప్పటినుంచి పలు విశ్వవిద్యాలయాల చెందిన విద్యార్థులు నిరసన బాట పట్టారు. ఇదే సమయంలో కోటా పునరుద్ధరణను నెలపాటు నిలిపివేస్తున్నట్టు బంగ్లాదేశ్ కోర్టు ప్రకటించింది. ఇక ఈ నిరసనల్లో 2,500 మంది గాయపడ్డారు. 300 మంది మృతి చెందారు. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కుదించింది. అయినప్పటికీ బంగ్లాలో నిరసనలు ఆగలేదు. అంతేకాదు షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో జూలై 5న తన ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.