Fuel Rates : మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం కష్టమే

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు సరఫరాను ప్రభావితం చేసింది. దీంతో భారత్ ముడి చమురు ధరలు తగ్గుతాయన్న వార్తలకు తెరపడినట్లైంది.

Written By: Mahi, Updated On : October 5, 2024 2:31 pm

Fuel Rates

Follow us on

Fuel Rates : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా ముడి చమురు ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. దీంతో త్వరలోనే భారత్ తో ఇంధర ధరల్లో తగ్గుదల ఉంటుందన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. ముడి చమురు దిగుమతులపై ఈ ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, పండుగ సీజన్‌కు ముందు చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఇంధన ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని మీడియా నివేదికలు గతంలో సూచించాయి. కానీ ఇటీవల పరిణామాలు పరిస్థితులను పూర్తిగా మార్చాయి ముడి చమురు ధరలు ఈ వారంలోనే ఒక్కసారిగా 5శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అంతే కాకుండా సమీప భవిష్యతులో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు సరఫరాను ప్రభావితం చేసింది. గత నెలలో బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు మూడు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. తక్కువ ఇంధన ధరల ద్వారా భారతీయ వినియోగదారులకు కొన్ని ప్రయోజనాలను కల్పించాలని చర్చలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. జమ్మూ & కాశ్మీర్‌లో ఎన్నికలు ముగిసి, హర్యానా ఎన్నికలు శనివారం పూర్తయినా కూడా ఇంధన ధరల్లో మార్పు రాలేదు. “గత వారంలో ప్రపంచ సరఫరా పరిస్థితి మారుతున్నందున, ప్రస్తుతం ధరలను తగ్గించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు” అని నివేదికలో పేర్కొన్నట్లు ఒక అధికారి తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ… ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయాలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

పెరుగుతున్న చమురు ధరలు భారతదేశం ఆర్థిక లోటుపై ఒత్తిడిని పెంచుతాయి. అధిక ఖర్చులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలకమైన మౌలిక సదుపాయాలు లేదా ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల నుండి నిధులను తిరిగి కేటాయించవలసి వస్తుందని ట్రేడ్జిని సీవోవో త్రివేష్ తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం కారణంగా దక్షిణ బీరుట్‌లోని బంకర్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసిన తరువాత, కేవలం ఒక వారంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 7డాలర్ల చొప్పున పెరిగాయి. ఫలితంగా, భారత క్రూడ్ బాస్కెట్, అనేక రకాల దిగుమతి చేసుకున్న ముడి చమురు మిశ్రమం, సెప్టెంబర్ చివరి నుండి బ్యారెల్‌కు సుమారు 3డాలర్లు పెరిగి, అక్టోబర్ 3నాటికి 75.22డాలర్లకి చేరుకుంది.

ఈ నెల ప్రారంభంలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.48.50 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్జిన్లు ఇంకా పూర్తిగా కోలుకోనందున, ఎల్ పీజీ ధరల పెరుగుదలకు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితి కూడా కారణమని చెప్పవచ్చు. ఈ వారం చమురు ధరలు 5శాతం కంటే ఎక్కువ పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75డాలర్లకి చేరుకుంది. వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్ చమురు సరఫరా గణనీయంగా ప్రభావితమైతే బ్యారెల్ ధర మరో 20డాలర్లు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఇరాన్ చమురు ఉత్పత్తిపైన పెద్ద ఎత్తున దాడి చేస్తే ప్రపంచ సరఫరా రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ తగ్గుతుందని సిటీ గ్రూప్ ఇంక్ హెచ్చరించింది. పెరుగుతున్న ముడిచమురు ధరలకు ప్రతిస్పందనగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సహా భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు పడిపోయాయి. కొనసాగుతున్న సంఘర్షణపై అనిశ్చితి, ప్రపంచ చమురు సరఫరాపై దానిప్రభావం మార్కెట్‌పై భారీ ఒత్తిడిని కలిగిస్తోంది.

నిజానికి ఇరాన్ నుండి భారతదేశం ముడి చమురు దిగుమతి దాదాపు స్వల్పం. భారతదేశం ప్రస్తుతం తన సరఫరా అవసరాలను తీర్చడానికి రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, అబుదాబి, యుఎస్‌తో సహా దాదాపు 40 వేర్వేరు దేశాల నుండి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ వివాదం ప్రపంచ చమురు మార్కెట్లలో ధరల అస్థిరత ప్రమాదాన్ని పెంచిందని నిపుణులు కూడా చెబుతున్నారు. వివాదాలు పెరిగి, హార్ముజ్ జలసంధి వంటి ప్రధాన సరఫరా మార్గాలకు అంతరాయం కలిగితేనే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80డాలర్ల కంటే ఎక్కువ పెరగడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ చమురు రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. ఇరాన్ ప్రతిరోజూ 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇజ్రాయెల్ చర్య తీసుకుంటే, అది హార్ముజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చు, ఇది ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద అంతరాయం కలిగించవచ్చు. భారతదేశానికి ఇది సవాలుగా మారుతుందని నిపుణులు తెలిపారు.