Chinese scientist : హాలీవుడ్ లోని కాల్పానిక సినిమాలు చూస్తున్నప్పుడు.. మనలో మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తులు తిరిగి పుట్టడం.. వారి ఆత్మలు భూమ్మీద తిరగడం.. వారు చనిపోయినప్పటికీ మాట్లాడటం.. అనేవి మనకు ఒకింత వింతగా అనిపిస్తాయి. అయితే ఇవన్నీ వింతలు కావని.. నిజాలని నిరూపించే పనిలో పడ్డారు చైనా శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చనిపోయిన వ్యక్తుల రూపంలో డిజిటల్ అవతార్ లను చైనా కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. వీటికి “డెడ్ బోట్” అని నామకరణం చేశాయి. చనిపోయిన మనుషులు జీవించి ఉన్న కాలంలో.. వారు మాట్లాడిన మాటలు.. వారి జీవితకాలంలో ముఖ్యమైన వీడియోలను వినియోగించి ఈ అవతార్ లను చైనా కంపెనీలు రూపొందిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం ద్వారా ఇవి చనిపోయిన మనిషి లాగానే సంభాషిస్తాయి. ఇవి విజయవంతం కావడంతో చైనాలో డెడ్ బోట్ లను కొనుగోలు చేయడానికి చైనా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ఒక మనిషి మరణించిన తర్వాత కొంతకాలానికి వారిని మర్చిపోతారు. అప్పుడప్పుడు వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అయితే ఈ డెడ్ బోట్ లు చనిపోయిన మనిషి జ్ఞాపకాలను పదేపదే గుర్తుకు తెస్తాయని.. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికన్ కంపెనీలకు ధీటుగా..
అమెరికన్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి జీవితానికి సంబంధించిన అనేక ఉపకరణాలను రూపొందిస్తున్నాయి. అంటే ఆ ప్రయోగాలు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఒకవేళ అవి విజయవంతం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికన్ కంపెనీలే గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. అయితే దానికి చెక్ పెట్టేందుకు చైనా కంపెనీలు డెడ్ బోట్ లను రూపొందిస్తున్నాయని గ్లోబల్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే వీటిని చైనా కంపెనీలు తిప్పికొడుతున్నాయి. టెక్నాలజీ అనేది అమెరికాకు మాత్రమే సొంతం కాదని.. వినూత్నంగా ఆలోచించే ఏ దేశమైనా సరే కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టవచ్చని చెబుతున్నాయి. అయితే అమెరికన్ కంపెనీలు మాత్రం ఇలాంటి డెడ్ బోట్ ల తయారీని హాస్యాస్పద ప్రయోగాలుగా కొట్టిపారేస్తున్నాయి.. ఇలాంటి ప్రయోగాలు మరోవైపు టర్న్ తీసుకొని మనిషి జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తాయని హెచ్చరిస్తున్నాయి. “చైనా కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు చేస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఇలాంటి ఉపకరణాలు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వాటి వల్ల ఒక్కోసారి మనుషుల్లో సున్నితత్వం చచ్చిపోతుంది. యాంత్రీకరణ పెరుగుతుంది. మనిషికి మాత్రమే సాధ్యమైన భావోద్వేగాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పుడు మనుషులు కూడా ఒక యంత్రాలుగానే మారతారని” అమెరికన్ పరిశోధకులు చైనా శాస్త్రవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.