Lottery : ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంద గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. కొంతమంది అక్కడి పరిస్థితులకు అలవాటు పడి ఏళ్లుగా ఉపాధి పొందుతుండగా, కొంత మంది అనారోగ్యంతో మృతిచెందుతున్నారు. కొందరు అక్కడ స్థిరపడలేక నిరాశగా వెనక్కు వస్తుంటారు. ఇలా గల్ఫ్ బాధితుల అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కరుణించింది. అక్కడి లాటరీ టికెట్ కొని జాక్‌పాట్ కొట్టాడు.
2017లో దుబాయ్‌కి..
ఆంధ్రప్రదేశ్‌కుచెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెలనెలా 100 దిర‍్మహ్(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేశాడు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు. తాజాగా ఈ డ్రాలో విజేతగా నిలిచి ఏకంగా రూ.2.25 కోట్లు గెలిచాడు.
గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ విజేతగా..
పొదుపు పథకం చందాదారులకు లక్కీడ్రా నిర్వహించగా గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నాడు. భారత కరెన్సీలో దాదాపు రూ.2.25 కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్‌మనీ రావడంతో నాగేంద్రమ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని తెలిపాడు.