Sunita Williams : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వరుసగా మూడోసారి వెళ్లి రికార్డు సృష్టించింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు ఆమె ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లి వచ్చారు. ఎక్కువ సేపు అంతరిక్షంలో వాక్ చేసిన మహిళగా కూడా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె జూన్ 6వ తేదీన మూడో విడత అంతరిక్షంలోకి వెళ్లారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి వెళ్లారు. బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ వ్యోమ నౌకలో వెళ్లారు. ఈ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా రెండు సార్లు కౌంట్‌డౌన్ నిలిపివేసింది నాసా. మూడోసారి జూన్ 6న స్టార్‌లైనర్‌లో ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు బయల్దేరారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకోకముందే.. స్టార్‌లైనర్‌లో నుంచి హీలియం లీక్ అవుతున్నట్లు నాసా గుర్తించింది. అయితే ఇద్దరూ క్షేమంగా గమ్యం చేరారు. 15 రోజుల్లో అంటే జూన్ 14న వారు తిరిగి భూమికి రావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌కు చేపట్టిన మరమ్మతులు ఫలించడం లేదు. దీంతో ఇప్పటికీ వారు ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు. సాంకేతిక కారణాలతో మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరో ఆరు నెలలు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాసా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
నాసా కీలక అప్‌డేట్..
ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్వి విల్మోర్‌పై రాకపై బుధవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ‘బోయింగ్ స్టారైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉంది. అది కూడా స్పేక్స్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో..‘ అని నాసా పేర్కొంది. దీన్నిబట్టి చూస్తుంటే సునీత, విల్మార్ మరో ఆరు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారిని తీసుకొచ్చేందుకు నాసా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్పేక్స్ క్రూ–9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను పంపించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్‌ను భూమ్మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే వారం స్పష్టత..
ఇక ఇద్దరినీ స్టార్‌లైనర్‌లో తీసుకురావాలా? లేదా క్రూ డ్రాగన్‌ను ఉపయోగించాలా? అన్నదానిపై వచ్చే వారం నాసా నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. అయితే, ఇలా ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడోసారి వెళ్లిన సునీతా..
ఇదిలా ఉంటే సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి గతంలో 2006లో, 2012లో ఆమె అంతరిక్ష యాత్ర చేశారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ కూడా చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. కానీ, తిరిగి భూమికి రావడమే క్లిష్టంగా మారింది.