Suella Braverman : బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ సంచలనం సృష్టించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటికీ బ్రేవర్మాన్ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేరోమ్ అండ్ వాటర్లూ విల్లే నియోజకవర్గం నుంచి బ్రేవర్మాన్ పోటీ చేసి విజయం సాధించారు. లేబర్ పార్టీకి చెందిన గెమ్మా ఫర్నివాల్‌పై 6 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2015 నుంచి బ్రేవర్మాన్ ఫారెహామ్‌కు ఎంపీగా ఉన్నారు. 2022-23 సంవత్సరంలో హోం సెక్రటరీగా పనిచేశారు.
గెలిచినా క్షమాపణ..
ఇదిలా ఉంటే బ్రేవర్మాన్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 14 ఏళ‍్ల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడంతో ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పార్టీ పనితీరు గురించి మాట్లాడుతూ మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. ప్రజలను నిరాశపర్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
లేబర్ పార్టీ ఘన విజయం..
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో వామపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారం కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో అధికారం మారింది. లేబర్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు.