South Korea And China Relations: చుట్టుపక్కల ఉన్న దేశాలను కబళిస్తూ.. అంతర్జాతీయ సరిహద్దులను ఆక్రమిస్తూ.. ఇతర దేశాలతో గొడవలు పెట్టుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటుంది చైనా. కమ్యూనిస్టు దేశమైనప్పటికీ.. ఎక్కడ కూడా ఆ భావజాలాన్ని చూపించదు. పైగా సామ్రాజ్యవాదానికి ప్రతీకగా నిలుస్తుంది చైనా. ఉత్పత్తి రంగంలో నెంబర్ వన్ గా ఉన్నామని.. శ్రామిక శక్తిలో ప్రథమ స్థానంలో ఉన్నామని.. ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదుగుతున్నామని.. నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా నిలబడతామని చైనా కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నది. అంతేకాదు అమెరికాకు అనేక రంగాలలో సవాల్ విసిరుతోంది. అయితే అమెరికా ఎత్తుల ముందు చైనా ఎంత మేరకు నిలబడుతుంది అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే చైనా చేసుకుంటున్న ప్రచారం ఓ స్థాయిలో ఉంది. పైగా చైనా ఇటీవల అమెరికా సుంకాలు విధించడంతో.. భారతదేశానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది.
కేవలం భారత్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలతో కూడా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలని చైనా భావిస్తోంది. వాస్తవానికి చైనా గురించి తెలిసిన ఏ దేశం కూడా.. దానితో అంట కాగడానికి ఒప్పుకోదు. కళ్ళ ముందు శ్రీలంక, పాకిస్తాన్, టిబెట్ వంటి దేశాలు కనిపిస్తున్నాయి కాబట్టి.. చైనా దమన నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం దక్షిణ కొరియాకు కూడా తెలుసు. అందువల్లే దక్షిణ కొరియా చైనాతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటుంది. అయితే చైనా మాత్రం దక్షిణ కొరియాతో ఆర్థిక సంబంధాలను పెంచుకోవాలని భావిస్తోంది. అందువల్లే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జె మ్యూంగ్ తో భేటీ అయ్యారు.
లీ జె మ్యూంగ్ ను కలిసిన తర్వాత జిన్ పింగ్ ఓ కానుక ఇచ్చారు.. తమ దేశంలో ఉత్పత్తి అయ్యే షావోమి ఫోన్లను లీ జె మ్యూంగ్ , అతని భార్యకు జిన్ పింగ్ కు కానుకగా ఇచ్చారు. వాటిని చూసిన లీ జె మ్యూంగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ” వీటి ద్వారా మా మీద ఏమైనా నిఘా పెట్టారా? ఇంకా ఏమైనా పరికరాలు అమర్చారా? ఈ ఫోన్లకు వారంటీ ఉంటుందా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.. దానికి జిన్ పింగ్ తనదైన శైలిలో స్పందించారు. ” ఈ ఫోన్ ల ద్వారా ఎటువంటి నిఘా లేదు. ఎటువంటి పరికరాలు ఏర్పాటు చేయలేదు. అవసరమైతే మీరు చెక్ చేసుకోవచ్చని” జిన్ పింగ్ పేర్కొన్నాడు. లీ జె మ్యూంగ్ చైనా అధ్యక్షుడిని మాత్రమే కాదని.. యావత్ చైనాను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భావిస్తున్న చైనాకు లీ జె మ్యూంగ్ భలే గడ్డి పెట్టాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. మరి దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.