Sleeping Prince : సౌదీ అరేబియాలో ఒక యువరాజు ఉన్నారు. ఆయన పేరు ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. ఆయనను ముద్దుగా “స్లీపింగ్ ప్రిన్స్” అని పిలుస్తారు. ఎందుకంటే, 2005లో ఆయనకు ఒక కారు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి అంటే సుమారుగా 20 ఏళ్లుగా ఆయన కోమాలోనే ఉన్నారు. అయితే, ఇటీవల ఆయన కోమాలోంచి బయటపడ్డారని, మేలుకున్నారని ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కానీ, అది నిజం కాదని తేలింది. ఏప్రిల్ 18, 2025న ఆయన తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ, ఆయన ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు. ఆ వైరల్ వీడియోలో ఉన్నది వేరే వ్యక్తి అని తర్వాత తెలిసింది.
వైరల్ అయిన వీడియోలో యువరాజు కోమాలోంచి మేలుకొని తన కుటుంబ సభ్యులను కలుస్తున్నట్లు చూపించారు. “2005లో ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్ళిన ‘స్లీపింగ్ ప్రిన్స్’ చివరకు మేలుకున్నారు” అని X లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో ప్రిన్స్ ఫోటోతో పాటు, హాస్పిటల్‌లో ఒక వ్యక్తిని బంధువులు పలకరిస్తున్న వీడియో కూడా ఉంది.
కానీ, అసలు నిజం ఏంటంటే ఫోటోలో ఉన్నది నిజంగానే ప్రిన్స్ అల్-వలీద్. అయితే, ఆ వీడియోలో ఉన్నది మాత్రం ఆయన కాదు. ఆ వీడియో యాజిద్ మహ్మద్ అల్-రాజ్హి అనే సౌదీ వ్యాపారవేత్త, మోటార్‌స్పోర్ట్స్ ఛాంపియన్. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు బాజా జోర్డాన్ ర్యాలీలో గాయాలయ్యాయి. ఆయన కోలుకుంటున్నప్పుడు తీసిన వీడియోనే ఈ యువరాజుకు యాడ్ చేశారు.
వైరల్ వీడియోతో పాటు టెక్ట్స్ కూడా యాడ్ చేశారు.. “20 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిన సౌదీ స్లీపింగ్ ప్రిన్స్ చివరకు తన జీవితాన్ని తిరిగి పొందారు. ఇదంతా ఆయనపై ఆశ వదులుకోని తండ్రికి ధన్యవాదాలు.” అని రాసుకొచ్చారు. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి రాజకుటుంబానికి చెందిన వాడు కాదు. ప్రమాదంలో వెన్నెముకకు గాయాలైన అల్-రాజ్హిది.
అల్-రాజ్హి ఆసుపత్రిలో కోలుకుంటున్న, డిశ్చార్జ్ అయిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని భాగాలను కోమాలో ఉన్న యువరాజు ఫోటోతో కలిపి ఎడిట్ చేసి, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ప్రిన్స్ అల్-వలీద్ కోమాలోంచి మేలుకున్నారని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఆయన బిలియనీర్ ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ కుమారుడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన రియాద్‌లోని కింగ్ అబ్దులజీజ్ మెడికల్ సిటీలో లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు. 2015లో వైద్యులు లైఫ్ సపోర్ట్‌ను తొలగించమని యువరాజు కుటుంబానికి సలహా ఇచ్చారు. కానీ ఆయన తండ్రి ఒప్పుకోలేదు. దేవుడి మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
2019లో కూడా ప్రిన్స్ కదిలినట్లు ఓ వీడియో వైరల్ అయింది. కానీ అది కూడా ఫేక్ వీడియోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిన్స్ ఆరోగ్య పరిస్థితితలో ఎలాంటి మార్పు రాలేదు. యువరాజుకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. నిరంతరం వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారు.