Endurance Ship: టైటానిక్ షిప్ గురించి ప్రపంచమంతా తెలుసు. కానీ అలాంటి షిప్ లు చాలా వరకూ సముద్రాల్లో మునిగిపోయాయి. కానీ 107 ఏళ్ల కింద మునిగిపోయిన ఒక నౌక ఇన్నేళ్లకు బయటపడింది. దానికి సంబంధించిన ఓడను సముద్రగర్భంలో గుర్తించి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

టైటానిక్ నౌక 1912 సంవత్సరంలో 2224మంది ప్రయాణికులతో మునిగిపోయింది. ఇందులో 1500మంది కంటే ఎక్కువమంది చనిపోయారు. ఆ విషాద ఘటన తర్వాత దాదాపు 3 ఏళ్లకు మరో నౌక ప్రమాదం చోటుచేసుకుంది. అదే ‘ఎండ్యూరెన్స్’. 107 ఏళ్ల తర్వాత ఇది బయటపడింది.
అంటార్కిటిక్ అన్వేషకుడు సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ కు చెందిన నౌకే ఈ ‘ఎండ్యూరెన్స్’. 1915 సంవత్సరంలో అంటార్కిటిక్ లో గడ్డ కట్టిన సముద్రంలో చిక్కుకున్న ఈ నౌక నెమ్మదినెమ్మదిగా మునిగిపోయింది. అప్పటి నుంచి దాని ఆచూకీ లభించలేదు. ఆ ప్రమాదం జరిగిన రోజున షాకిల్టన్, అతడి సిబ్బంది చిన్న పడవల ద్వారా తప్పించుకున్నారు.
ఎట్టకేలకు ఆ నౌకను సముద్రం అడుగున కనుగొన్నారు. ఈ నౌక మునిగి 107 ఏళ్లు కావస్తున్నా ఎక్కడా చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సముద్రంలో 10వేల అడుగుల లోతులో ఉన్న ఈ నౌకపై ఉన్న పేర్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఈ నౌకను కనుగొనేందుకు పరిశోధకులు పడిన కష్టాలను త్వరలోనే ‘నేషనల్ జియోగ్రా గ్రాఫిక్ ఎక్స్ ప్లోరర్ సిరీస్’లో ప్రసారం చేయనున్నారు.

సముద్రంలో మునిగిపోయినా కూడా ఈ నౌక ఎంతో ఠీవీగా, గర్వంగా నిలబడి ఉంది. చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉందని అంటార్కిటిక్ పరిశోధకుడు అగుల్హాస్ తెలిపారు. ఈ నౌకను ఆయనే కనుగొన్నారు. అంటార్కిటికా మంచులో అత్యంత కష్టతరమైన ఈ నౌకను కనుగొనేందుకు ఈయన టీం చాలా కష్టపడింది. గడ్డకట్టిన సముద్రంలో మంచు తుఫానులు, మైనస్ 18 డిగ్రీల వరకూ పడిపోయిన ఉష్ణోగ్రతలు తట్టుకొని మరీ ఈ నౌకను కనుగొన్నారు.
అంటార్కిటికాలోని వాయువ్య తీరంలోని వెడ్డల్ సముద్రంలో 3008 మీటర్లలోతులో ఈ నౌకను కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ నౌకను బయటకు తీసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇందులోని వస్తువులు, కళాఖాండాలు కూడా తాకరాదు. వాటిని సైతం పైకి కూడా తీసుకురాకూడదు. నౌకను వెలుపలి నుంచే చిత్రీకరించాలి. నౌక వీడియో, చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.