Donald Trump: అమెరికా పాలనా పగ్గాలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. అధికారం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. రష్యా నుంచి ఆయిల్ కొంటుదన్న సాకుతో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించడమే ఇందుకు ఉదాహరణ. తాజాగా ట్రంప్ కెనడా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. అంతే కాదు రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ప్రభావం చూపింది. అయితే ఈ విషయంలో అమెరికా సెనెట్ ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకించింది. డొనాల్డ్ ట్రంప్ ఒక టీవీ ప్రకటనను కారణంగా చూపుతూ కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. కెనడా ప్రకటనలో అమెరికా వ్యూహాలను విమర్శించిన ధోరణి వైట్‌హౌస్‌ను కుదిపింది. ఆపై ట్రంప్ కెనడియన్ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించాలని ప్రకటించారు.
సెనెట్ తిరస్కారం..
అయితే, ట్రంప్ నిర్ణయానికి అమెరికా సెనెట్ వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 50–46 ఓట్ల తేడాతో డెమోక్రట్స్‌తోపాటు నలుగురు రిపబ్లికన్ సెనెటర్లు కూడా అధ్యక్ష నిర్ణయాన్ని తిరస్కరించారు. ఇది కేవలం వాణిజ్య పరంగానే కాక, అధ్యక్షాధికారాల పరిమితిపైనా చర్చకు దారితీసింది. వర్జీనియా సెనెటర్ టిమ్ కైన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ‘‘అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక చట్టాల దుర్వినియోగం ద్వైపాక్షిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. మైనే రాష్ట్రానికి చెందిన సెనెటర్ సుసాన్ కాలిన్స్ కూడా ఈ టారిఫ్‌లు స్థానిక వ్యాపారాలు, సరిహద్దు రాష్ట్రాల ఉద్యోగాలపై తీవ్రమయిన ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
టారిఫ్‌ల వెనుక స్వార్థ రాజకీయాలు..
కెనడాపై ఈ ఆంక్షలు కేవలం ఆర్థికం కాదు, రాజకీయ ప్రతిస్పందనగా మారాయి. కెనడియన్ నాయకులు అమెరికా విధానాలపై సమీక్షాత్మక వ్యాఖ్యలు చేయడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయే ప్రమాదంలో ఉన్నందున, వాషింగ్టన్–ఒట్టావా సంబంధాలు మళ్లీ సున్నా స్థాయికి చేరాయి. ఇక బ్రెజిల్ సుంకాల విషయములో కూడా సెనెట్ అధ్యక్ష అధికారాలను పరిమితం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపధ్యంలో ట్రంప్ టారిఫ్ విధానంపై రిపబ్లికన్ పార్టీలోనే విభేధాలు స్పష్టమవుతున్నాయి. వాణిజ్య స్వేచ్ఛను కాపాడే ధోరణి పెరుగుతోంది.
కెనడా అమెరికాకు ఉన్న రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ తాత్కాలిక ఆక్షేపణలు కొనసాగితే సరిహద్దు వాణిజ్యం, ఉక్కు–అల్యూమినియం రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ప్రభావితమవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒప్పంద చర్చలు తిరిగి ప్రారంభమయ్యే వరకు రెండు దేశాలు పరస్పర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ అర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.