Saudi-Pak military alliance: ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్లుగా ఖతార్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడి.. ఇప్పుడు భారత్‌కు ముప్పుగా మారుతోంది. ఇస్లామిక్ దేశాలన్నీ అత్యవసర సమావేశమయ్యాయి. అరబ్ నాటో ఏర్పాటు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్–సౌదీ అరేబియా మధ్య సెప్టెంబర్ 17న కీలక ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య సంతకం చేసిన ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య దశాబ్దాల భద్రతా సహకారాన్ని మరింత బలపరుస్తుంది. ఇరుదేశాల్లో ఒకటిపై దాడి జరిగితే రెండింటిపైనా అని పరిగణించి సంయుక్తంగా ఎదుర్కొనేలా రూపొందించబడిన ఈ ఒప్పందం, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ దాడులు, దక్షిణేష్యాలో భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రక్షణాత్మకమేనని ప్రకటించినప్పటికీ, పాక్ అణు సామర్థ్యాలు సౌదీకి అందుబాటులోకి వస్తాయనే సూచనలు ప్రపంచ భద్రతా వ్యవస్థను మలుపు తిప్పుతున్నాయి.
దశాబ్దాల సహకారానికి ఫార్మల్ ఆకారం
పాక్–సౌదీ మధ్య 1960ల నుంచి ఉన్న భద్రతా సంబంధాలు – పాక్ సైనికుల శిక్షణ, సలహాలు, ఆయుధాలు – ఇప్పుడు ’స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రీమెంట్’ రూపంలో మారాయి. ఒప్పందం ప్రకారం, ఇరుదేశాల్లో ఏదైనా దురాక్రమణను రెండింటిపైనా దాడిగా చూస్తూ, సమన్వయ పద్ధతులతో ప్రతిస్పందిస్తారు. ఇది ఎలాంటి దేశాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదని, కేవలం రక్షణాత్మక గోడగా పనిచేస్తుందని పాక్ డిఫెన్స్ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. సౌదీకి ఇది మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ బెదిరింపులకు వ్యతిరేకంగా సహాయకరం. పాక్‌కు ఆర్థిక సహాయం (ఇటీవల ు3 బిలియన్ రుణం)తో పాటు సైనిక బలోపేతానికి మార్గం. ఇజ్రాయిల్ దోహాలో హమాస్ నాయకులపై దాడి (సెప్టెంబర్ 9) తర్వాత ఈ ఒప్పందం రావడం, అమెరికా భద్రతా హామీలపై సౌదీ అపార్థాన్ని సూచిస్తుంది.
పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఒప్పందం సందర్భంగా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్, భారత్–పాక్ ఉద్రిక్తతల సమయంలో సౌదీ సైన్యం పాక్‌తో కలిసి నిలబడుతుందని నిర్ధారించారు. ‘కచ్చితంగా, ఎలాంటి సందేహం లేదు.‘ ఇది దురాక్రమణకు పాల్పడిన ఏ దేశాన్నైనా సంయుక్తంగా ఎదుర్కొనేలా రూపొందించబడిందని, కానీ దురుద్దేశంతో కాదని పేర్కొన్నారు. మరింత కీలకంగా, పాక్ అణు కార్యక్రమం ‘సౌదీకి అందుబాటులోకి వస్తుంది‘ అని చెప్పారు. రియాధ్‌ను పాక్ అణు చాత్రి కిందకు తీసుకువచ్చినట్టుగా మారింది – ఇది మొదటిసారి అధికారిక గుర్తింపు. రాయిటర్స్‌కు మాట్లాడుతూ అణు ఆయుధాలు ‘ప్రధాన లక్ష్యం కాదు‘ అని చెప్పినప్పటికీ, బెదిరింపు వచ్చినప్పుడు ఒప్పందం అమలవుతుందని స్పష్టం చేశారు. ఇటీవలి మే నెల్లో భారత్–పాక్ మధ్య చిన్న సైనిక సంఘర్షణ (ఓపరేషన్ సిందూర్) నేపథ్యంలో ఇవి భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్, ఒప్పందం ‘పరస్పర ఆసక్తులు, సున్నితత్వాలను‘ గుర్తించాలని సూచించారు. భారత్–సౌదీ మధ్య ‘విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం‘ గత కొన్నేళ్లుగా బలపడిందని, జాతీయ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై పరిణామాలను అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.
మారనున్న ప్రాంతీయ–ప్రపంచ పరిణామాలు..
ఈ ఒప్పందం మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరుస్తూ, చైనా ప్రభావాన్ని పెంచుతుంది – పాక్, సౌదీ రెండూ చైనా మిత్రులు. ఇజ్రాయిల్‌కు కొత్త అణు డిటరెంట్, ఇరాన్‌కు సౌదీ–పాక్ ఐక్యతకు వ్యతిరేకంగా సవాలు. దక్షిణేష్యాలో భారత్–పాక్ ఉద్రిక్తతలు (మే 2025 సంఘర్షణ) మరింత జటిలమవుతాయి; పాక్‌కు అరబ్ మద్దతు వల్ల కాశ్మీర్ విషయంలో ధైర్యం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, ఇది ’ఇస్లామిక్ నాటో’ లాంటి అలయన్స్‌లకు మార్గం సుగమం చేస్తుంది – ఇతర గల్ఫ్ దేశాలు చేరే అవకాశం ఉంది. స్థిరత్వానికి ఇది రక్షణాత్మకమే అయితే మంచిది, కానీ అణు విస్తరణకు దారి తీస్తే ప్రపంచ భద్రతా సమతుల్యతను భంగపరుస్తుంది.