Salt Typhoon: ఇద్దరు బలవంతులు కొట్టుకుంటే యుద్ధం చాలా వరకు కొనసాగుతుంది. కొన్ని సందర్భాలలో విజేత ఎవరు అనేది తేలక పోయినప్పటికీ పోరు మాత్రం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు ప్రపంచ తొలి, రెండు ఆర్థిక శక్తులు పోరాడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా కదనరంగంలో కత్తులు దూసుకుంటున్నాయి.. పైకి చూసేందుకు ఈ పోరాటం గొప్పగా అనిపించకపోయినప్పటికీ.. దీని ఆధారంగా మాత్రం వేల కోట్ల వ్యవస్థ ఉంది.
ప్రపంచ దేశాలను అమెరికా టారిఫ్ లతో వేధిస్తోంది. భారత్ నుంచి మొదలు పెడితే బ్రెజిల్ వరకు ఇదే పరిస్థితి ఉంది. చైనా మీద కూడా అమెరికా టారిఫ్ లు విధించినప్పటికీ.. డ్రాగన్ దేశం పెద్దగా భయపడడం లేదు. పైగా పెద్దన్నకు మరో విధంగా చుక్కలు చూపిస్తోంది. సాల్ట్ టైపూన్ పేరుతో వణికిస్తోంది. ఇంతకీ ఇది చైనా తయారుచేసిన కొత్త వైరస్ కాదు. అలాగని ప్రపంచ విపత్తు అంతకన్నా కాదు. దీని ద్వారా అగ్ర రాజ్యాన్ని డ్రాగన్ పెడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ పేరు చెబితేనే అమెరికా కు అరెకరం తడిసిపోతోంది.
సాల్ట్ టైపూన్ అనేది చైనాకు చెందిన సైబర్ ముఠా. ఇది కొంతకాలంగా అమెరికాను వెంటాడుతోంది. వెంటాడమే కాదు వేటాడుతోంది. అమెరికాలోని ప్రతి పౌరుడి డాటాను ఈ సైబర్ ముఠా హాక్ చేసింది. 2019 నుంచి దాదాపు 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకోండి. ఈ భారీ ఎటాక్ ద్వారా చైనా సరికొత్త పన్నాగాన్ని పన్నిందని తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా సైబర్ దాడులకు పాల్పడింది.. ఈ సైబర్ ముఠాకు చైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. వారికోసం భారీగానే ఖర్చు పెట్టిందని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది.
“కొంతకాలంగా అమెరికా నిపుణులు భయపడుతున్నారు. ఏదో జరిగిందని ఇబ్బంది పడుతున్నారు. బయటకి వారు చెప్పకపోయినప్పటికీ ఏదో జరిగి ఉంటుందని అర్థమవుతూనే ఉంది. దీని వెనుక చైనా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాల్ట్ టైఫూన్ పేరుతో చైనా ఒకరకంగా సైబర్ విధ్వంసానికి పాల్పడింది. అమెరికా నుంచి మొదలుపెడితే దాదాపు 80 దేశాల వరకు దాడులకు పాల్పడింది. తద్వారా 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.. అత్యంత విలువైన సమాచారాన్ని తస్కరించింది. దీని ద్వారా ఏం చేస్తుందనేది ఇప్పటికి అర్థం కావడం లేదు. కాకపోతే ఇదంతా కూడా అమెరికాను దెబ్బ కొట్టడానికేనని” న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.