America: అమెరికా అంటే అవకాశాల స్వర్గం.. డాలర్ రాజ్యం.. సంపన్న దేశం.. ఇలాంటి ఉప మానాలనే మీడియా ఉపయోగిస్తుంది. అమెరికా గురించి సినిమాలలో కూడా గొప్పగా చెబుతుంటారు. ఇక ప్రపంచ దేశాలు కూడా అమెరికా అంటే భయపడుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మారకం అనేది డాలర్ తో కొనసాగిస్తారు కాబట్టి.. సహజంగానే డాలర్ కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అయితే అంతటి అమెరికా ఇప్పుడు ముప్పు ముంగిట ఉందా? త్వరలో ఆర్థికంగా పతనం కాబోతోందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే మీడియాలో వినిపిస్తున్నాయి.
ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ అమెరికా బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు మరిన్ని టారిఫ్ లు విధిస్తామని ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. భారత్ నుంచి మొదలు పెడితే చైనా వరకు అన్ని దేశాలు కూడా అమెరికా టారిఫ్ ల వల్ల ఇబ్బంది పడుతున్నవే. అమెరికా వల్ల ప్రపంచ దేశాలు నరకం చూస్తున్నాయి. టారిఫ్ ల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. వెనకడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. పైగా ట్రంప్ వల్ల భారత ఐటీ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇటీవల కాలంలోనే హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఐటి పరిశ్రమలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయితే దీనిపై ట్రంప్ ఇంతవరకు వెనకడుగు వేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న అమెరికాలో అంతర్గతంగా మాత్రం పరిణామాలు ఏ మాత్రం బాగోలేదు.. అమెరికాలో బడ్జెట్ కు ఆమోదం లభించలేదు. దీంతో పూర్తిగా షట్ డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. డెమొక్రటిక్, రిపబ్లికన్ లు వేరువేరుగా ప్రతిపాదనలు చేయడంతో అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. వ్యయ ప్రామాణిక బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వానికి నిధుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. ఏకంగా ఎఫ్ఏ విభాగంలో 11 వేల మంది ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ అత్యవసర విమాన నియంత్రణ కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయని తెలుస్తోంది. దాదాపు 41 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పూర్తిగా నిలిచిపోయాయి.
అమెరికాలో ఏర్పడిన ఈ పరిస్థితి వల్ల హెల్త్, హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీలు పనికి దూరమయ్యాయి. ప్రజారోగ్యం, విమాన రవాణా.. ఇతర అత్యవసర సేవలు మాత్రమే అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. రక్షణ, పోలీసు, ఎమర్జెన్సీ హెల్త్ సర్వీస్ వంటి విభాగాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో అమెరికా ఇలా స్తంభించిపోవడం ఇది మొదటిసారి కావడం విశేషం. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ ఆమోదం విషయంలో ఏర్పడిన ఈ సందిగ్ధత అమెరికా పరువును మొత్తం పోగొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటువంటి పరిణామాలు అగ్రరాజ్యానికి ఏమాత్రం మంచివి కావని వాపోతున్నారు.