Sahara water crisis tragedy: ఎడారిలో ప్రయాణం ఒక నరకం. ఇక సహారా ఎడారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎడారి ప్రయాణంలో మంచినీళ్లు చాలా ముఖ్యం. అయితే ఈడ్ అల్–అధా పండుగను మాలి దేశంలో జరుపుకుని తిరిగి వెళ్తున్న కుటుంబాలు వారు ప్రయాణిస్తున్న లారీ సహారా ఎడారి మధ్యలో చెడిపోయింది. మండే ఎండలు, నీళ్లు దొకక, సహాయం చేసేవారు లేక మూడు రోజుల్లో 49 మంది ప్రాణాలు వదిలారు. ఇద్దరు మాత్రం 50 కిలోమీటర్లకు పైగా నడిచి, నీటి వనరును చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారు రక్షణ బృందాలను పంపించగా లారీ ఆగిపోయిన ప్రదేశంలో 49 మృతదేహాలను కనిపించాయి.
ఎడారిలో ఏం జరిగిందంటే..
మాలి–నైజర్–ఆల్జీరియా సరిహద్దుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఎడారి ప్రయాణాలకు ప్రసిద్ధి. అగాడెజ్ ప్రాంతంలో అస్సమాకా సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో పండుగకు వెళ్లి వస్తున్న వారి లారీ ఇంజిన్ పనిచేయక ఆగిపోయింది. ప్రయాణికులు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. కానీ తీవ్రమైన వేడి, నీటి కొరత మధ్య ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక్కొక్కరు దాహం, డీహైడ్రేషన్‌కు బలైపోయారు. మృతదేహాలు లారీ కింద, చుట్టుపక్కల చెల్లాచెదురుగా కనిపించాయి.
సహారా ఎడారి అనేక మరణాలు..
సహారా ఎడారి ఎప్పటికప్పుడు ఇలాంటి విషాదాలకు సాక్షిగా నిలుస్తోంది. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల్లోని అస్థిరత కారణంగా ప్రజలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సారి వారు మైగ్రంట్లు కాదు.. సాధారణ ప్రజలు, పండుగ సంబరాలు ముగించుకొని తిరిగి వస్తున్నవారు. ఈ ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు, ఎమర్జెన్సీ సహాయం, కమ్యూనికేషన్ సదుపాయాలు చాలా పరిమితం. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, సరిహద్దు భద్రతా సమస్యలు. పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణించడం, అయినా భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ దుర్ఘటనకు దోహదపడింది. గతంలో కూడా సహారాలో ఇలాంటి బహుళ మరణాలు జరిగాయి.
ఈ విషాదం నుంచి పాఠం నేర్చుకొని, ఎడారి ప్రయాణాలను సురక్షితం చేయడానికి నైజర్ ప్రభుత్వం మాత్రమే కాదు, పొరుగు దేశాలు కూడా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎడారి దాహం ఎవరినైనా మింగేస్తుంది. పండుగ సంబరాల నుంచి వస్తున్న సాధారణ ప్రజలనైనా. ఈ దుర్మరణాలు గుండెను కలచివేస్తాయి.
