https://oktelugu.com/

Narendra Modi: ఉప్పు, నిప్పును కలపడం అంత సులభం కాదు..కానీ మోడీ చేసింది ఇదే..

నీటిని, నీలి గగనాన్ని కలపొచ్చు.. ఇసుకనుంచి తైలం తీయవచ్చు. కానీ ఉప్పును, నిప్పును ఏకం చేయలేం. నిప్పు కాలుతుంటే.. అందులో ఉప్పు వేస్తే.. చీటికిమాటికి చిటపటల శబ్దం వినిపిస్తుంది. అది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. ఆ చిటపటలను పూర్తిగా తగ్గించారు. ఫలితంగా ప్రపంచం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనిని ఆసక్తిగా గమనిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 28, 2024 / 08:59 PM IST

    Narendra Modi

    Follow us on

    Narendra Modi:  ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన రష్యా, యూరోపియన్ యూనియన్ లో కీలకమైన ఉక్రెయిన్ గత ఏడాది నుంచి యుద్ధాన్ని మొదలుపెట్టాయి. అటు ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్.. ఇటు రష్యా కు మిగతా దేశాలు అండగా ఉన్నాయి.. ఫలితంగా ఆ యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా లాంటి దేశాలు రంగంలోకి దిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈ దశలో భారత్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా, ఉక్రెయిన్ దేశాలలో పర్యటించారు. పుతిన్, జెలెన్ స్కీ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ తరహా బలమైన నిర్ణయం మరే దేశ అధ్యక్షుడు తీసుకోలేదు. నరేంద్ర మోడీ పుతిన్, జెలెన్ స్కీ తో జరిపిన భేటీ ల వల్ల అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరిగింది.

    రెండుగా చీలిపోయాయి

    రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయింది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు బాసటగా ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాలు, పాశ్చాత్య దేశాలకు విరోధులుగా ఉన్న దేశాలు రష్యాను బలపరిచాయి. భారత్ మాత్రం న్యూట్రల్ స్టేజి కొనసాగించింది. రష్యాతో ఎప్పటినుంచో ఉన్న అనుబంధాన్ని భారత్ కాపాడుకుంటూనే.. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని నిలువరించాలని పదేపదే పుతిన్ కు చెప్పింది. కొన్ని సందర్భాల్లో గుర్తుచేసింది. పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నించగా.. ఆ దేశం నుంచి చమరు కొనుగోలు చేసి.. భారత్ ఆర్థికంగా అండగా నిలిచింది.

    శాంతి ముద్ర సుస్థిరం

    రష్యా – ఉక్రెయిన్ మధ్య అంతకంతకు శత్రుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్, జెలెన్ స్కీ తో నరేంద్ర మోడీ భేటీ కావడం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను మరింత పెంచింది. శాంతి కామక దేశంగా మరోసారి ప్రపంచానికి రుజువు చేసింది.. సుస్థిరత, శాంతి, సౌభ్రాతృత్వం విషయంలో భారత్ వాణిని మోడీ రష్యా – ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులతో చాటిచెప్పారు.. రష్యా నుంచి ముడి చమురు, సైనిక పరివారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని, అమెరికా నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ పరికరాలు దిగుమతి చేసుకున్న భారత్.. తన ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంది. తాము ఎవరికీ వ్యతిరేకం కాదనే సంకేతాలను ప్రధాని ప్రపంచానికి ఇచ్చారు.

    భిన్న వైఖరులు వ్యక్తమవుతున్నప్పటికీ..

    రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా రకరకాల వైఖరులు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ రెండు దేశాలకు బాసటగా అందించే దేశాలు ఆర్థికంగా బలవంతమైనవి. ఒక పక్షం వైపు భారత్ నిలబడితే.. మరో పక్షం నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. అందువల్లే భారత్ మధ్యే మార్గంగా వ్యవహరించింది. దౌత్య విధానాన్ని సున్నితంగా కొనసాగించింది. ఫలితంగా ప్రపంచం ఎదుట మోడీ చాకచక్యం భారత్ ను శాంతి కామకదేశంగా నిలబెట్టింది.