Homeఅంతర్జాతీయంIndia Pakistan Naval Tension: బంగాళాఖాతంలో పాక్‌ జలాంతర్గాములు.. చైనా సాంకేతికతతో కొత్త వ్యూహం

India Pakistan Naval Tension: బంగాళాఖాతంలో పాక్‌ జలాంతర్గాములు.. చైనా సాంకేతికతతో కొత్త వ్యూహం

India Pakistan Naval Tension: 1971లో జరిగిన భారత–పాకిస్తాన్‌ యుద్ధంలో భారత నౌకాదళం బంగాళాఖాతంలో చూపిన బలం పాకిస్థాన్‌ను ఆ ప్రాంతం నుంచి పారిపోయేలా చేసింది. ఆ దెబ్బ తర్వాత దాయాది దేశం ఆ జలాల్లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్‌ తన నౌకాదళంలో హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. చైనా నుంచి మొత్తం ఎనిమిది ఈ రకమైన నౌకలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. వాటిలో ఒకటి ఇటీవల ఆ దేశం చేతుల్లోకి వచ్చింది. దాన్ని తీసుకొచ్చే ఫ్లోటిల్లా కమాండర్‌ కమోడోర్‌ ఒమర్‌ ఫరూఖీ శ్రీలంకలో ఆగి మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలు అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతంలోకి సైనిక శక్తిని విస్తరించేందుకు సహాయపడతాయని చెప్పారు. వీటిని ఆయన ‘గేమ్‌ చేంజర్‌’గా అభివర్ణించారు.

బంగాళాఖాతం వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఈ జలాలు ఏ ఒక్క దేశానికి ప్రత్యేకంగా చెందవు. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాలు దీని తీరాల్లో ఉన్నాయి. 12 నాటికల్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలు, 200 నాటికల్‌ మైళ్ల వరకు ఆర్థిక మండలం ఉంటాయి. దాని తర్వాత అంతర్జాతీయ జలాలు. భారత్‌కు ఇది చాలా కీలకమైన ప్రాంతం. తూర్పు నావెల్‌ కమాండ్, అణు జలాంతర్గాముల తయారీ కేంద్రం, నౌకల నిల్వ స్థావరం విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఇక్కడ వాణిజ్య మార్గాలు, కమ్యూనికేషన్‌ లైన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.

పాక్‌ నేవీ బలహీనతలు
పాకిస్తాన్‌ నౌకాదళం భారత నేవీ ముందు చాలా వెనకబడి ఉంది. భారత్‌ వద్ద అణు జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు ఉండగా, పాక్‌ చైనా, టర్కీ వంటి దేశాలపై ఆధారపడుతోంది. చైనా తయారీ ఫ్రిగేట్లు, టర్కీ నిర్మిత కార్వెట్లు దాని ప్రధాన ఆధారం. ఇప్పుడు కొత్తగా వస్తున్న హంగోర్‌ శ్రేణి నౌకలు బంగాళాఖాతంలో పెద్ద మార్పు తీసుకురావడం కష్టమే అని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి మోహరింపులు భారత్‌కు ఎప్పటికీ అసౌకర్యం కలిగించేవే.

హంగోర్‌ శ్రేణి విశేషాలు
చైనా అభివృద్ధి చేసిన ఈ జలాంతర్గాములు ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. సాధారణ డీజిల్‌–ఎలక్ట్రిక్‌ నౌకల కంటే ఎక్కువసేపు నీటి అడుగున ఉండగలవు. దీంతో వాటిని గుర్తించడం, ట్రాక్‌ చేయడం కష్టతరం అవుతుంది. 1971 తర్వాత అరేబియా సముద్రానికి మాత్రమే పరిమితమైన పాక్‌ నేవీ ఇప్పుడు ఈ నౌకల సాయంతో మరింత విస్తరించాలని చూస్తోంది.

బలపడుతున్న పాక్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు..
ఇటీవలి కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. 2024లో షేక్‌ హసీనా ప్రభుత్వం ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, వాణిజ్యం, సైనిక సహకారం పెరిగాయి. కరాచీ–ఛట్టోగ్రామ్‌ మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యం మొదలైంది. గతేడాది పాక్‌ యుద్ధనౌక ఛట్టోగ్రామ్‌ తీరంలో మోహరించడం కూడా గమనార్హం.

1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన పీఎన్‌ఎస్‌ హంగోర్‌ టార్పెడో దాడితో భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ ఖుక్రీని ముంచేసింది. భారత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక యుద్ధనౌక మునిగిపోవడం అదే మొదటిసారి. అయితే భారత నేవీ తిరిగి దాడి చేసి పాక్‌ యుద్ధనౌక పీఎన్‌ఎస్‌ ఘాజీని ధ్వంసం చేసింది. 13 రోజుల్లోనే యుద్ధం ముగిసి పాక్‌ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో పాక్‌ నేవీ కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ నౌకలు ఆ పరిస్థితిని మార్చగలవా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular