Pakistan PM Sharif Nobel Peace Prize Controversy: హత్యలు చేసినవాడు సంతాపం తెలిపితే ఎలా ఉంటుంది.. క్రూరంగా ఉండేవాడు శాంతి ప్రవచనాలు చెబితే ఎలా ఉంటుంది.. వీటికి కనక మనిషి రూపం ఇస్తే ఖచ్చితంగా అతడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అవుతాడు. మరో అవకాశం ఉంటే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా అవుతాడు. హక్కులను అణచివేయడంలో.. భారత్ మీద వ్యతిరేక కార్యకలాపాలు సాగించడంలో షరీఫ్, మునీర్ ముందు వరుసలో ఉంటారు. దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టి.. ఉగ్రవాదులకు వంద పాడటంలో వీరు సిద్ధహస్తులు. అందువల్లే కదా ఆ మధ్య భారత్ దాడులు చేస్తే.. నష్టపోయిన ఉగ్రవాదులకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించారు. చివరికి ఉగ్రవాదులను కూడా సైన్యంలో ఒక భాగం చేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు.
తమకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ను జైలు పాలు చేశారు. చిత్రహింసలు పెడుతున్నారు. ఆ మధ్య ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అతని భార్య పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్క వార్త కూడా బయట ప్రపంచానికి తెలియనియకుండా మునీర్, షరీఫ్ జాగ్రత్త పడ్డారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ మీద క్రూరమైన దాడులు చేశారు. అక్కడ చిన్న పిల్లల మరణానికి కారణమయ్యారు. అయితే ఆఫ్గనిస్తాన్ దూకుడు ముందు పాకిస్తాన్ తలవంచక తప్పలేదు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. అక్కడి ప్రజలు తాము భారతదేశంతో కలుస్తామని నినాదాలు చేయడంతో.. మునీర్, షరీఫ్ అత్యంత దారుణంగా వ్యవహరించారు. అక్కడ సైన్యాన్ని మొహరించి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో మునీర్, షరీఫ్ ద్వయం చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు ఉండదు. అమెరికాతో అంటకాగి.. ట్రంప్ శరణు జొచ్చి బతికిపోతున్నారు గాని.. అమెరికా సపోర్ట్ లేకపోతే ఈపాటికి షరీఫ్, మునీర్ కథ వేరే విధంగా ఉండేది.
ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడానికి పాకిస్తాన్ ఏదో నంగనాచి నాటకాలు ఆడింది. ఇస్లామాబాద్ లో ఓ హోటల్లో భేటీ ఏర్పాటు చేసింది. . అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. శాంతి దిశగా ఒప్పందం కుదరలేదు. చివరికి హోటల్ బిల్లులు కూడా చెల్లించలేక పాకిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కి.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట. ఇటీవల అక్కడ మీడియాలో ఈ లేకి వార్తలు ప్రసారమయ్యాయి. దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయ్యమన్నట్టు.. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన వార్తను పంజాబ్ అసెంబ్లీ ఉటంకించింది. అంతేకాదు పాకిస్తాన్ మీడియా వార్తలకు వంత పాడింది. ప్రధానమంత్రి షరీఫ్ కు.. ఆర్మీ చీఫ్ మునీర్ కు పీస్ ప్రైజ్ ఇవ్వాలని కోరింది.
యుద్ధం ఆపడానికి వీరిద్దరూ చేసిన యత్నాలు గొప్పవని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసింది. వాస్తవానికి పాకిస్తాన్లో చర్చలు ఏ దిశగా సఫలం కాలేదు. మరోవైపు ట్రంప్ కూడా తాను పదవ యుద్ధాన్ని ఆపబోతున్నట్టు ప్రకటించుకున్నారు. నోబెల్ బహుమతి తనకు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.. నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఊహల్లో తేలి ఆడుతున్న ట్రంప్ కు పంజాబ్ అసెంబ్లీ చేసిన తీర్మానం చెవిన పడిందో లేదో.. అన్నట్టు మునీర్, షరీఫ్ కు మాత్రమే కాకుండా, చనిపోయిన లాడెన్ కు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అంటూ భారతీయులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఉగ్రవాద దేశానికి నోబెల్ శాంతి బహుమతి పొందే అర్హత ఎక్కడిదని మండిపడుతున్నారు.