Pakistan Missile Crashed: పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత సైనిక, ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటింది. ఇదే సమయంలో పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్, చైనా ఆయుధాలు తేలిపోయాయి. ఈ నేపథ్యంలో శత్రు దేశాల నుంచి రక్షణ కోసం భారత్ సొంతంగా మలమైన ఆయుధాలు తయారు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల వారం రోజుల వ్యవధిలో మూడు కీలకమైన ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది. తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ 15 వేల అడుగుల ఎత్తులో లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగా, అగ్ని–1, పృథ్వి–2 మిసైళ్లు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంతో విజయవంతంగా పరీక్షించబడ్డాయి. ఈ పరీక్షలు భారత్ రక్షణ సాంకేతికతలో ఆధిపత్యాన్ని, కచ్చితత్వాన్ని చాటాయి. ఈ విజయాలు దేశ సైనిక బలాన్ని బలోపేతం చేయడమే కాక, పొరుగు దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాయి.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా…
భారత్ విజయవంతమైన పరీక్షలు పాకిస్తాన్‌ను ఆందోళనకు గురిచేశాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకన్నట్లుగా.. తామూ ఏదైనా చేయాలనుకుంది దాయాది దేశం.. తన షాహీన్–3 మిసైల్‌ను పరీక్షించాలని నిర్ణయించింది. 2,700 కిలోమీటర్ల రేంజ్‌తో అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ మిసైల్‌తో భారత నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, జూలై 22న పంజాబ్‌లోని డేరా ఘాజీఖాన్లో జరిగిన ఈ పరీక్ష విఫలమైంది. మిసైల్ ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది, ఒక భాగం అణ్వస్త్ర తయారీ కేంద్రానికి సమీపంలో, మరొక భాగం 180 కిలోమీటర్ల దూరంలో సైనిక స్థావరం దగ్గర పడింది. ఈ వైఫల్యం పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది. తృటిలో అణ్వస్త్ర తయారీ, సైనిక స్థావరాలు సురక్షితంగా బయటపడ్డాయి. లేదంటే ఎవరూ దాడి చయకుండానే పాకిస్తాన్ సొంతంగా నాశనం చేసుకునేది. పాకిస్తాన్ ఈ వైఫల్యాలను దాచడానికి మీడియా నిషేధం, ఇంటర్నెట్ నిలిపివేత వంటి చర్యలు చేపట్టినప్పటికీ, బలూచిస్తాన్‌లో స్థానికులు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సత్యం బయటపడింది.
టెక్నాలజీ నిర్వహణలో విఫలం..
పాకిస్తాన్ ఆయుధాలు ఎక్కువగా ఉత్తర కొరియా, చైనా సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. ఈ ఆధారితత, స్వదేశీ సాంకేతికత అభివృద్ధిలో లోపాలు దాని వైఫల్యాలకు కారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ మరో ప్రయోగానికి సిద్ధమవుతుండటం దాని పట్టుదలను చూపిస్తుంది, కానీ సాంకేతిక లోపాలు, స్థానిక వ్యతిరేకత దానికి సవాళ్లుగా మిగిలాయి.
Also Read: ఇండియన్స్‌కు జాబ్ ఇవ్వొద్దు.. డొనాల్డ్ ట్రంప్ కు అంత పగ ఎందుకు?
అనేక వైఫల్యాలు..
షాహీన్–3 వైఫల్యం పాకిస్తాన్‌కు కొత్త కాదు. గతంలో 2023 అక్టోబర్‌లో షాహీన్ మిసైల్, 2021లో డేరా బుక్తిలో ఒక మిసైల్, 2020లో బాబర్–2, మరో మిసైల్ పరీక్షలు కూడా విఫలమయ్యాయి. ఈ పరీక్షలు బలూచిస్తాన్, సింద్ ప్రాంతాల్లో ప్రజలపై ప్రభావం చూపడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
భారత్ విజయవంతమైన ఆయుధ పరీక్షలు దాని రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ వైఫల్యాలు దాని సైనిక వ్యవస్థలోని బలహీనతలను బయటపెడుతున్నాయి. దీపావళి టపాసులను తలపించేలా పాకిస్తాన్ ఆయుధాలు తుస్సుమంటున్నాయి. అయినా మరో పరీక్షకు పాకిస్తాన్ సిద్ధం కావడం కొసమెరుపు.