Khawaja Asif: ఆపరేషన్ సిందూర్‌తో కన్ను చొట్టబోయి చావుతప్పిన చందంగా మారిన పాకిస్తాన్.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఆఫ్గాన్ తాలిబాన్ పాలకులు తిరగబడడంతో తొక ముడిచింది. ఇలాంటి పాకిస్తాన్.. ఇప్పుడు భారత్, ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధానికి స్ధిమంటోంది. కయ్యానికి కాలుదువుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. భారత్, అఫ్గానిస్తాన్‌తో యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని ఆయన చేసిన ప్రకటన దేశ భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు.
తాలిబన్ బాధ్యత వహించినా.. భారత్‌ను బద్నాం చేయాలని..
తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడికి తామే కారణమని ప్రకటించింది. అయినా పాకిస్తాన్‌ప్రభుత్వం మాత్రం బాధ్యతను భారత్, అఫ్గానిస్తాన్ మీదకు మళ్లిస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత మద్దతు ఉన్న శక్తులు పాక్‌ను అస్థిరం చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా రక్షణ మంత్రి భారత్, ఆఫ్గాన్‌పై యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు.
కవ్వింపు చర్యలు..
పాకిస్తాన్‌లో అంతర్గత భద్రత క్షీణిస్తోంది. అయినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. టీటీపీ వంటి తీవ్రవాద గుంపులు ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో మరింత చురుకుగా మారుతున్న వేళ, ప్రభుత్వ అసమర్థతపై ఉత్పన్నమైన విమర్శలను తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తమపై వ్యతిరేకత రాకుండా కవ్వింపు చర్యలకు దిగుతోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ తరచూ భారత్‌పై మద్దతు ఆరోపణలు చేస్తూ వస్తోంది. కానీ ఇప్పటిదాకా దానికి ప్రామాణిక ఆధారాలు చూపలేకపోవడం గమనార్హం. భారత్ అధికారికంగా ఈ ఆరోపణలను ఖండిస్తూ, అంతర్గత ఉగ్రవాద సమస్యలను మరో దేశంపై నెట్టివేయడం బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణిస్తోంది.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ సన్నాహాల వాతావరణం ఏర్పడితే ప్రాంతీయ శాంతి స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ కూటములు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు, పాక్ రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం కూడా ఈ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది. ఇలా వార్నింగులు ఇస్తున్న పాకిస్తాన్ కు నిజంగానే భారత్, అప్ఘన్ కలిసి రెండు వైపులా దాడి చేస్తే అసలు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉంటుందా? అన్న సందేహాలు వెలువడుతున్నాయి..