Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్తావారాలతోపాటు 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. డీజీఎంవో స్థాయి చర్చల తర్వాత సీజ్‌ఫైర్ కుదిరింది. అయితే ఆపరేషన్ సిందూర్‌లో తామే విజయం సాధించినట్లు పాకిస్తాన్ సంబురాలు చేసుకుంది. ర్యాలీలు నిర్వహించింది. పాక్ సైనికాధికారి ఆసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. కానీ నిజం నిలకడమీద తెలుస్తుంది అన్నట్లు.. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిమ్ తర్వాత అంగీకరించారు. తాజాగా తెహ్రిక్ – ఎ – తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ తమ దేశంపై దాడులు చేస్తోందన్న సాకుతో పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడుల చేసింది. ఆఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించిన రోజే దాడులు మొదలు పెట్టింది. రెండు రోజులు ఓపిక పట్టిన ఆప్గాన్ మూడోరోజు ప్రతిదాడి చేసింది. దీంతో పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఖతార్ జోక్యంతో సీజ్‌ఫైర్ కుదిరింది. మొదట తమకు ఏమీ కాలేదని బుకాయించిన పాకిస్తాన్ తాజాగా సైనికులు మరణించినట్లు అంగీకరించింది. తాలిబాన్ బలగాలతో జరిగిన ఘర్షణల్లో అనేకమంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించారు.
తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్తాన్ టార్గెట్ అంటూ..
తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు ఆఫ్గాన్ భూభాగం నుంచీ పాకిస్తాన్‌పై దాడులు చేపడుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ దళాలు తన భద్రతా చర్యలను విస్తరించాయి. అయితే, ఆ ప్రయత్నాలే ఇప్పుడు ఎదురు దెబ్బగా మారాయి. ఆఫ్గాన్ సైన్యం, తాలిబాన్ వర్గాలు ఒకేసారి పాకిస్తాన్ సైనిక శిబిరాలపై ప్రతీకార దాడులు చేశాయి. దీంతో పాకిస్తాన్ సైనికులు దుర్మరణం చెందారు. 80 మందిని బందీలుగా పట్టుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికలపై #PaijaanInTears హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం, సైనిక కుటుంబాలు అసహాయతతో చిగురుటాకులా వణకిపోయాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా మృతుల సంఖ్య ప్రకటించకపోయినా, గణనీయమైన నష్టం జరిగిందని అంతర్గత వర్గాలు ఒప్పుకుంటున్నాయి.
దాడిచేసి దెబ్బతిన్న పాకిస్తాన్..
ఆఫ్గానిస్తాన్‌తో ‘‘సరిహద్దు శాంతి’’ ప్రయత్నాల పేరుతో అమెరికా, చైనా మధ్య మధ్యవర్తిత్వాన్ని ఆశించిన పాకిస్తాన్ దానికి వ్యతిరేక ఫలితాలనే అనుభవిస్తోంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి స్వయంగా ఆఫ్గాన్ దాడిలో తమ సైనికులు మరణించారని అంగీకరించారు. ఇదిలా ఉంటే ఆఫ్గాన్ సర్కార్ తమ భూభాగాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఇప్పటికే బలహీనమైన ఇస్లామాబాద్ దౌత్య సంబంధాలకు మరింత దెబ్బతీసింది. రష్యా, ఇరాన్, యూఏఈ వంటి దేశాలు ఈ సంఘర్షణపై మౌనం పాటిస్తుండగా, అమెరికా మితంగా స్పందించడం పాకిస్తాన్‌ను ఒంటరి చేస్తోంది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆర్థిక మాంద్యం, అంతర్గత అశాంతి కలగొలిపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ కొన్ని కీలక నిర్ణయాల ముందు నిలిచి ఉంది. సరిహద్దు రక్షణ పేరుతో యుద్ధ మార్గం ఎంచుకుంటుందా లేదా ఆఫ్గాన్ చర్చల ద్వారానే పరిష్కారం సాధిస్తుందా అనేది చూడాలి. కానీ ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా చెప్పిన సైనిక నష్టాలు ఆ దేశ సైనిక బలగాల ఉత్సాహాన్ని గణనీయంగా దెబ్బతీసిన సంగతి స్పష్టంగా కనిపిస్తోంది.