New Zealand- Tax On Cow Burps: అక్బర్ కాలంలో జుట్టు పెంచితే పన్ను విధించేవారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. మొగలుల కాలంలో ఎక్కువ పంట పండిస్తే అందులో పావు వంతు రాజ్యానికి ఇవ్వాలని కూడా తెలుసుకున్నాం. సరే కాలం గడిచింది. రాజులు కన్ను మూశారు. రాజ్యాలు కాలగర్భంలో కలిశాయి. మనిషి అభివృద్ధి వైపు పయనిస్తున్నాడు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో చిత్ర విచిత్రమైన పన్నులు, నవ్వు పుట్టించే పుట్టించే నిబంధనలు అమలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక పన్నును తెరపైకి తీసుకువచ్చి ఓ దేశ ప్రధానమంత్రి వార్తల్లోకి ఎక్కారు.. ఇంతకీ ఏమిటా దేశం? ఎవరి మీద పన్ను విధించబోతున్నారు? ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారు? చదివి తెలుసుకుందాం పదండి.

గ్రీన్ హౌస్ వాయువులకు కారణమవుతున్నాయట?!
న్యూజిలాండ్ తెలుసు కదా. శీతల దేశం! ఆస్ట్రేలియా పక్కనే ఉంటుంది. పర్యాటకం, వ్యవసాయం, గొర్రెల పెంపకం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు. చిన్న దేశం, పైగా అన్ని వనరులు ఉండటంతో సిరి సంపదలతో తులతూగుతున్నది. ఒక నివేదిక ప్రకారం ఈ దేశంలో సుమారు 10 శాతం భారతీయులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల న్యూజిలాండ్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వాతావరణ మార్పులకు ఆవుల నుంచి వచ్చే గ్యాస్, త్రేన్పులు కూడా కారణమవుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు నిరూపించారట. అయితే వ్యవసాయానికి ఉపయోగించే జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించేందుకు పన్నులను విధించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆవుల కడుపు నుంచి గ్యాస్ విడుదలై పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో వాటిని పెంచుతున్న రైతులపై పన్ను విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా ఆవులు వెలువరించే గ్యాస్ పై పన్నులు వసూలు చేయడం ప్రపంచ చరిత్రలో మొదటిసారి.
వాయువులను తగ్గించాలని ప్రతిపాదన పెట్టుకుంది
వాస్తవానికి శీతల దేశమైన న్యూజిలాండ్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఉష్ణోగ్రతలు అసమాన రీతిలో పెరుగుతున్నాయి.. పరిశ్రమల నుంచి వచ్చే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు కఠిన చర్యలను తీసుకుంది.. అయినప్పటికీ వాతావరణంలో మార్పులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇటీవల అక్కడి శాస్త్రవేత్తలు నిరూపించిన ప్రకారం పశువుల కడుపులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతుండడంతో రైతుల పై పన్నులు చెల్లించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా అర్డెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. వాతావరణంలో అసమాన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రజల భవితవ్యాన్ని కాపాడేందుకు 2025 నాటికి వ్యవసాయ ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో 60.2 లక్షల ఆవులు ఉన్నాయి. వాస్తవానికి ఆవుల్లో సహజ గ్రీన్ హౌస్ వాయువులతో పాటు వాటి మూత్రం నుంచి నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతూ ఉంటుంది.

ఆవుల నుంచి వెలువడే గ్యాస్ నుంచి మీథేన్ వాయువు విడుదల అవుతూ ఉంటుంది. ఇవి గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణం అవుతున్నాయి. అందువల్లే న్యూజిలాండ్లో ఎండలు మండిపోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అక్కడి రైతులపై పన్నులు వేయాలని చూస్తోంది. ఆవుల మంద పరిమాణాన్ని బట్టి రైతులు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. సేకరించే పన్నులతో పరిశోధనలు, కొత్త సాంకేతికత, వాతావరణ అనుకూల పద్ధతులను అనుసరించి రైతులకు రాయితీగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాలోని సిడ్ని, మెల్ బోర్న్, కాన్ బెర్రా పరిసర ప్రాంతాల్లో అక్కడి రైతులు పశువులను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఉత్పత్తి అయిన పాలు ఇతర దేశాలకు తరలి వెళ్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఆస్ట్రేలియా కూడా ఇటీవల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆస్ట్రేలియాకు పక్కనే న్యూజిలాండ్ ఉండడం, ప్రభుత్వం పశువులు పెంచే రైతులపై పన్నులు విధించాలనే ఆలోచన చేయటం తో అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా అమలు చేస్తారని తెలుస్తోంది.. అయితే గత కొన్ని ఏళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం చెట్లను ఇష్టానుసారంగా నరికేయడమేనని ఐక్యరాజ్యసమితి గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. కానీ రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టు.. చెట్ల నరికివేతను నిలువరించాల్సిన న్యూజిలాండ్ ప్రభుత్వం.. చూలను పెంచుకునే రైతులపై పన్నులు విధించాలనుకోవడం హాస్యాస్పదం కాకపోతే మరి ఏమిటి?!