Sunita Williams : ఈ ఏడాది జూన్ 5న భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ లో అంతరిక్షానికి వెళ్లారు.. వీరిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో అత్యంత తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు తిరిగి భూమ్మీదకి రావడానికి అనేక కాటంకాలు ఏర్పడుతున్నాయి.. దీంతో వారు తిరిగి భూమ్మీదకు ఎప్పుడు వస్తారనే విషయంపై మొన్నటివరకు ఒక స్పష్టత రాలేదు. వారు త్వరలో వస్తారని ప్రకటించిన నాసా.. శనివారం రాత్రి కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో వారు భూమి మీదకి తిరుగు ప్రయాణం అవుతారని.. స్పేస్ ఎక్స్ కు చెందిన క్ర్యూ డ్రాగన్ క్యాప్సూల్ లో వారు ఫిబ్రవరి నెలలో భూమ్మీదకి వచ్చేందుకు ప్రయాణం ప్రారంభిస్తారని వెల్లడించింది. సునీత, విల్ మోర్ ను తీసుకెళ్లిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాసా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమ్మీదకు తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ ప్రయాణంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, క్యాప్సిల్ పనితీరు ను అటు నాసా, ఇటు బోయింగ్ సంస్థ కలిసి పరిశీలిస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే సునీత, విల్ మోర్ ఉండనున్న నేపథ్యంలో వారు స్పేస్ స్టేషన్ లో మరిన్ని పరిశోధనలు చేస్తారు.. స్పేస్ స్టేషన్ నిర్వహణ పరిశీలిస్తారు. సిస్టం టెస్టింగ్ పై అధ్యయనం చేస్తారు.
కొద్దిరోజుల పాటు అంతరిక్షంలోనే..
” సునీత, విల్ మోర్ అంతరిక్షంలోనే మరికొన్ని రోజులు ఉంటారు. అంతరిక్ష యానం సురక్షితం, సాధారణమైనదే అయినప్పటికీ.. అది అత్యంత ప్రమాదకరం.. టెస్ట్ ఫ్లైట్ అనేది సురక్షితం, సాధారణమైనది కాదు.. సునీత, విల్ మోర్ మరి కొన్ని రోజులు అంతరిక్షంలోనే ఉండాల్సి ఉందని” నాసా అడ్మినిస్ట్రేషన్ అధికారి బిల్ నెల్సన్ పేర్కొన్నారు..”స్పేస్ క్రాఫ్ట్ వ్యవస్థ పనితీరును గమనించడంలో నాసా, బోయింగ్ తీవ్రంగా కృషి చేసింది. అ బృందాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని” నెల్సన్ వివరించారు. ఇక స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్ సెప్టెంబర్ లో భూమి మీదకి ఖాళీగా తిరుగు ప్రయాణం ప్రారంభించనుంది.
వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా..
జూన్ నెలలో బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించింది. వారంలోనే సునీత, విల్ మోర్ భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉండేది. అయితే ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. క్యాప్సూల్ లో థ్రస్టర్ లలో లోపాలు తలెత్తాయి. హీలియం లీకేజీ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో అందులో ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని నా స్పష్టం చేసింది. ఇక అప్పటినుంచి ఆ సమస్యను పరిష్కరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అవి విజయవంతం కాలేదు. చివరికి సునీత, విల్ మోర్ తిరిగి భూమ్మీదకి రావడం మరింత ఆలస్యం అవుతుందని నాసా చెప్పడంతో.. వాహక నౌక లో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదని ప్రపంచానికి తెలిసింది.