https://oktelugu.com/

Nahid Islam: షేక్ హసీనా గద్దె దిగడానికి కారణం ప్రత్యర్థి పార్టీలు కాదు.. ఇంతకీ ఆ పని చేసింది ఎవరంటే..

బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని నిలువునా కూల్చింది విద్యార్థి సంఘం నాయకుడు. అతని పేరు నహీద్ ఇస్లాం. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ విధిస్తూ తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఇస్లాం తీవ్రమైన పోరాడాలు చేశాడు. బంగ్లాదేశ్ ను అట్టుడికించేలా ఆ ఉద్యమానికి అతడు నాయకత్వం వహించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 6, 2024 / 10:00 PM IST
    Follow us on

    Nahid Islam: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరు ఉంది. ప్రత్యర్థి పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తొక్కిపడేశారనే అపవాదు ఉంది. విపక్షాలను అణగదొక్కారనే విమర్శ ఉంది. అయినప్పటికీ ఐదుసార్లు ప్రధానమంత్రి అయిన చరిత్ర ఆమెకు ఉంది. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన ఘనత ఆమె పేరు మీద ఉంది.. పైగా ఆమె బంగ్లాదేశ్ జాతిపిత రెహమాన్ కూతురు. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ముందు తలవంచక తప్పలేదు. ఘన చరిత్ర ఉన్నప్పటికీ.. ప్రాణ భయంతో పారిపోక తప్పలేదు. ఎంతో ధైర్యవంతురాలయిన షేక్ హసీనా భారత్ ఎందుకు పారిపోయారు? ఆమె గద్దె దిగడం వెనుక కారణం ఎవరు? ఆమె దేశం విడిచి వెళ్లిపోవడానికి దోహదం చేసింది ఎవరు? ఇన్నాళ్లు దీని వెనుక ఉంది ప్రతిపక్ష పార్టీలు అనుకున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం హసీనా దేశం విడిచి వెళ్లిపోయేందుకు, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాన కారణం ఓ విద్యార్థి నాయకుడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం..

    కూల్చింది అతడే..

    బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని నిలువునా కూల్చింది విద్యార్థి సంఘం నాయకుడు. అతని పేరు నహీద్ ఇస్లాం. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ విధిస్తూ తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఇస్లాం తీవ్రమైన పోరాడాలు చేశాడు. బంగ్లాదేశ్ ను అట్టుడికించేలా ఆ ఉద్యమానికి అతడు నాయకత్వం వహించాడు. రిజర్వేషన్ విధానం సరికాదని వెలుగెత్తాడు. సోషల్ మీడియాను ఉపయోగించి.. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను యువకులకు అర్థమయ్యేలాగా వివరించాడు. రిజర్వేషన్ విధానం పై అతడు సంధించిన ప్రశ్నలు హసీనా ప్రభుత్వాన్ని ఊపిరి ఆడకుండా చేశాయి. చివరికి ఆమె తన పదవికి రాజీనామా చేసే దిశగా పరిస్థితులు దోహదం చేశాయి. ఫలితంగా ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు..

    సహీద్ ఇస్లాం ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్నాడు. అతడు మానవ హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయస్థాయిలో కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని అతడు పూర్తిగా తప్పుపట్టాడు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉందని నేరుగా ఆరోపించాడు. ప్రభుత్వ ఉద్యోగాలను ఓ పార్టీ వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుని నిర్ణయాన్ని అతడు పూర్తిగా తప్పు పట్టాడు. అంతేకాదు షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో విస్తృతంగా ప్రచారం చేశాడు నహీద్. షేక్ హసీనా విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో.. నహీద్ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. “విద్యార్థులు కట్టెలు పట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని.. ఒకవేళ కర్రలు కూడా పని చేయని పక్షంలో ఆయుధాలను చేతుల్లోకి తీసుకుంటారని” షాభాగ్ లో నహీద్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించాయి. నిరసనలు మరింత పెరిగేందుకు కారణమయ్యాయి.

    కాగా, జూలై 19న సుమారు 25 మంది నహిద్ ను అతడి ఇంటి నుంచి అపహరించారు. కళ్లకు గంతలు కట్టారు. రెండు చేతులకు సంకెళ్లు వేశారు. అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతడు పూర్బాచల్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోసారి జూలై 26న కూడా అతడిని మరోసారి అపహరించారు.. గోనో సాహస్త్య నగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని అపహరించారు. అయితే నహీద్ ను తాము కిడ్నాప్ చేయలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు ప్రకటించారు. అయితే వారి మాటలను నహీద్ ఖండించాడు. తనను చంపేందుకు షేక్ హాసినా కుట్ర చేశారని ఆరోపించాడు. అయితే ఆ తర్వాత నహీద్ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అంతిమంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయేందుకు కారణమయ్యాయి.