Melania Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈఏడాది నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ప్రధానంగా పోటీ అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, విపక్ష రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యనే పోలీ నెలకొంది. సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య ముఖాముఖి డిబేట్ నిర్వహించింది. ఇందులో మహిళల అబార్షన్ అంశంపై కీలక చర్చ జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా అబార్షన్‌పై కీలకంగా స్పందించారు. అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుండగా.. మెలానియా మాత్రం అబార్షన్ హక్కును సమర్ధించారు.
8న మెమోర్ విడుదల..
‘మెలానియా’ పేరుతో అక్టోబర్ 8న విడుదల కానున్న మెమోర్ సుస్తకంలో అబార్షన్ల అంశంపై మెలానియా తన అభిప్రాయాన్ని పొందుపరిచారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మహిళ శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకే ఉండాలని, ఇంకెవరికో ఎందుకు ఉండాలి అని అవాంచిత గర్భానికి సంబంధించిన ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయడం, ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరిండం కిందకే వస్తుందని మెలోనియా రాసుకొచ్చారు. నవంబర్ 5న ఎన్నికలు జరుగనుండగా, దానికి కొన్ని వారాల ముందు ఈ పస్తకం విడుదల కానుంది.
డిబేట్‌లో కీలక చర్చ..
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 10న జరిగిన డిబేట్‌లో కమలా హారిస్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ట్రంప్‌కు గిట్టదన్నారు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని తెలిపారు. లైంగికదాడి వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదు అని పేర్కొన్నారు. ఇది మహిళలను అవమానించడమే అని తెలిపారు. ట్రంప్‌ను అధ్యక్షడిగా ఎన్నుకుంటే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారని ఆరోపించారు. గర్భవిచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరు. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుంది అని వివరించారు.
ఘాటుగా బదులిచ్చిన ట్రంప్..
ఇదిలా ఉంటే.. డిబేట్‌లో కమలా హారిస్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోనని తెలిపారు. కానీ, 8, 9 నెలల్లో గర్భవిచ్ఛిత్తిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. దానిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ఆ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని కమల పిలుపిస్తున్నారు. కానీ, ఆ విషయంలో అధికారం రాష్ట్రాలకే ఉండాలని మాజీ అధ్యక్షుడు వాదిస్తున్నారు.