https://oktelugu.com/

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

విమాన ప్రమాదాలకు నేపాల్‌ కేరాఫ్‌ అయినట్లు.. భూకంపాలకు జపాన్‌ కేరాఫ్‌.. ఆ దేశంలో ఏడాదికి పదుల సార్లు భూమి కంపిస్తుంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇదంతా అక్కడ కామన్‌.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 8, 2024 / 04:39 PM IST

    Earthquake In Japan

    Follow us on

    Earthquake In Japan: జపాన్‌: భూంపాలకు కేరాఫ్‌ అయిన జపాన్‌లో ఏటా పదుల సంఖ్యలో భూకంపాలు వస్తుంటాయి. అక్కడ ప్రజలు కూడా వీటికి అలవాటైపోయారు. అయితే ఇక్కడ భూకంపాల కారణంగా అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, సునామి హెచ్చరికలు జారీ కావడమే జపాన్‌ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండుసార్లు అణుబాంబుల దాడిలో దెబ్బతిన్న ఈ చిన్న దేశంలో సాంకేతికంగా వేగంగా వృద్ధి చెందింది. ఎలక్ట్రానిక్, రోబోల తయారీలో ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలకే సవాల్‌ విసురుతోంది. అయితే అక్కడి ప్రకృతి వైపరీత్యాలే ఆ దేశానికి పెద్ద సవాల్‌. తరచూ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్ధలు కావడం ఇక్కడ కామన్‌. తాజాగా జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపంతోపాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. జపాన్‌ తీర ప్రాంతాలైన మియాజాకి, కొచ్చి, ఇహైమ్, కగోషిమా, ఐటా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో భూమి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ కంపంతో జనం భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున మూడు నాలుగు సార్లు భూమి కంపించింది. దీంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది.

    భూకంపాలు ఎందుకు వస్తాయి?
    భూమి లోపల ఏడు టెక్టోనిక్‌ ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూమి వణుకుతుంది. దీనినే భూకంపం అంటారు. భూకంపాలను కొలవడానికి రిక్టర్‌ స్కేల్‌ ఉపయోగించబడుతుంది. దీన్నే రిక్టర్‌ మాగ్నిట్యూడ్‌ స్కేల్‌ అంటారు. రిక్టర్‌ మాగ్నిట్యూడ్‌ స్కేల్‌ 1 నుండి 9 వరకు ఉంటుంది. భూకంపం తీవ్రత దాని కేంద్రం నుండి అంటే భూకంప కేంద్రం నుంచి కొలుస్తారు. అంటే ఆ కేంద్రం నుంచి వెలువడే శక్తిని ఈ స్కేల్‌పై కొలుస్తారు. 1 అంటే తక్కువ తీవ్రత శక్తి బయటకు వస్తోంది. 9 అంటే అత్యధికం. ఇది విధ్వంసం సృష్టిస్తోంది. దూరంగా వెళ్లే కొద్దీ బలహీనంగా మారతాయి. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7గా ఉంటే, దాని చుట్టూ 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో బలమైన కంపనాలు వస్తాయి.

    రిక్టర్‌ స్కేలుపై తీవ్ర ఎలా కొలుస్తారు ?
    – 0 నుంచి 1.9 తీవ్రతతో భూకంపాలను సీస్మోగ్రాఫ్‌ ద్వారా మాత్రమే గుర్తించవచ్చు.
    – 2 నుంచి 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు స్వల్ప కంపనం ఉంటుంది.
    – 3 నుంచి 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు, ఒక ట్రక్కు దాటిపోయినట్లు అనిపిస్తుంది.
    – 4 నుంచి 4.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినప్పుడు కిటికీలు ఊగుతాయి. విరిగిపోతాయి. గోడలపై వేలాడుతున్న ఫ్రేములు పడిపోవచ్చు.
    – 5 నుంచి 5.9 తీవ్రతతో భూకంపం వస్తే ఇంట్లోని ఫర్నీచర్‌ కంపిస్తుంది.
    – 6 నుంచి 6.9 తీవ్రతతో భూకంపం వస్తే భవనాల పునాదులను పగులగొట్టి, పై అంతస్తులకు నష్టం వాటిల్లుతుంది.
    – 7 నుండి 7.9 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు, భవనాలు కూలిపోతాయి. భూగర్భంలో పైపులైన్లు పగిలిపోయాయి.
    – 8 నుంచి 8.9 తీవ్రతతో భూకంపం వస్తే భవనాలు, పెద్ద వంతెనలు కూలిపోవచ్చు.
    – 9 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం భారీ వినాశనానికి కారణమవుతుంది. పొలంలో ఎవరైనా నిలబడితే భూమి కంపించడం స్పష్టంగా చూడవచ్చు. సముద్రం దగ్గరగా ఉంటే, సునామీ సంభవించవచ్చు.

    రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలోనే..
    ఈ భూఫలకాలు మన చేతి గోర్లు పెరిగినంత వేగంగా కదులుతుంటాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్‌ అని పిలుస్తారు. అంటే ఒక వైపు ఉన్న భూఫలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి. నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే, ఒక్కోసారి రెండిటిలో ఒక ఫలకం వేగంగా కదలడం, లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో వచ్చే 80 శాతం ప్రధాన భూకంపాలు ‘‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’’ అనే ప్రాంతంలోనే వస్తాయి. ఇక్కడ పసిఫిక్‌ ఫలకం అంచులు మిగతా ఫలకాలతో రాపిడికి గురవుతూ ఉంటాయి.