https://oktelugu.com/

Bangladesh : తిలకం తుడిచేయండి.. తులసి పూసలు దాచుకోండి.. అలా అయితేనే బంగ్లాదేశ్ లో బతుకుతారు…

"కుంకుమపువ్వు తినకండి. ఆ అలవాటును కొద్దిరోజులు మానుకోండి. మెడలో వేసుకున్న తులసి పూసలను దాచుకోండి. నుదుటన ధరించిన తిలకాన్ని తుడుచుకోండి. మీ తలను వస్త్రంతో కప్పుకోండి. దయచేసి బయటికి రాకండి. అత్యవసరం ఉంటే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టండి. ఆ తర్వాత వెంటనే మీమీ గమ్యస్థానాలకు వెళ్లిపోండి." ఇదేదో ప్రభుత్వం చేసిన సూచన కాదు. ఇస్కాన్ సన్యాసులకు కోల్ కతా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రామన్ దాస్ చేసినహిత బోధ.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 11:01 AM IST

    Kolkata ISKCON Vice President Radha Raman Das

    Follow us on

    Bangladesh : కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యులపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ హిందూ సంఘం నాయకుడు, ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అతడికి మందులు అందించడానికి వెళ్లిన ఇద్దరు జూనియర్ డాక్టర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్ అరెస్ట్ అయిన తర్వాత అతని కార్యదర్శి కూడా అందుబాటులో లేకుండా పోయాడు.. దాడులు మరింత పెరగడం.. శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో ఇస్కాన్ సన్యాసులకు రాధా రామన్ దాస్ పలు కీలక సూచనలు చేశారు. ” బంగ్లాదేశ్ లో సంక్షోభం నెలకొంది. ఇలాంటి సమయంలో ఇస్కాన్ సన్యాసులు వారిని వారు కాపాడుకోవాలి. ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇంట్లో పూజలు చేయండి. బయట మాత్రం కనిపించవద్దు. నుదుట తిలకాన్ని ధరించకండి.. కాషాయ వస్త్రాలను ధరించకండి. ఆలయాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో పూజలు మాత్రం చేసుకోండి. ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండండి. అప్పుడే మీరు ప్రాణాలతో ఉంటారని” రాధా రామన్ దాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిని ఇస్కాన్ సభ్యులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు.. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సభ్యులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాధా రామన్ దాస్ ఈ సూచనలు చేశారు.

    కృష్ణదాస్ ను విడుదల చేయాలని సోమవారం ఇస్కాన్ సభ్యులు ఆల్బర్ట్ రోడ్డులోని రాధా గోవిందా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక మంగళవారం ఛటో గ్రామ్ కోర్టు ఎదుట కృష్ణ దాస్ ను విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు. కాగా, 63 మంది ఇస్కాన్ సన్యాసులు శనివారం భారత్ వచ్చేందుకు ప్రయత్నించగా సరిహద్దుల వద్ద అధికారులు అడ్డుకున్నారు. ఆదివారం కూడా అదే ప్రయత్నం చేయగా అడ్డగించారు. ఇతర మార్గాల మీదుగా భారత్ వచ్చేందుకు వారు యత్నించగా అధికారులు నిలువరించారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యుడు కృష్ణదాస్ దేశద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలపై బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నాటి నుంచి అక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఇస్కాన్ సన్యాసులపై దాడులు మొదలయ్యాయి. “ఇటీవల కోర్టుకు హాజరయ్యే హిందూ న్యాయవాదులపై దాడులు జరిగాయి. ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కృష్ణ దాస్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న ప్రధాన న్యాయవాదిని కూడా కొట్టారని” రాధా రామన్ దాస్ ఆరోపించారు.”ఇస్కాన్ సన్యాసులు సమయమనం పాటించాలి. పరిస్థితి బాగోలేదు. శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు స్వీయ భద్రతను పాటించాలని” రాధా రామన్ దాస్ ఇస్కాన్ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.